కలం, వెబ్ డెస్క్: దీపావళి పండుగ నేపథ్యంలో కాలుష్యంపై యూపీ సీఎం ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. దీపావళి వేడుకలో పటాకులు కాల్చిన వారిని నిందించడం సరికాదని, ఒకరోజు పండుగ జరుపుకోవడం వల్లే కాలుష్యం ఏర్పడిందని విమర్శించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలతో మొత్తం వ్యవస్థను కలుషితం చేస్తున్న వారిని మాత్రం ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు.
పండుగల సమయంలోనే కాలుష్యం గురించి మాట్లాడటం ఏంటని ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. కొత్తగా నియమితులైన 1,146 మంది జూనియర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే ముఖ్యమంత్రి కిసాన్ దుర్ఘటనా కళ్యాణ్ యోజన కింద 4,300 మంది లబ్ధిదారులకు రూ.2,215 కోట్ల సహాయాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. దీపావళిని ప్రజలు జరుపుకోవడంలో తప్పులేదని, పటాకులపై ఎలాంటి నిషేధాలు విధించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఆయన (Yogi Adityanath) స్పష్టం చేశారు. తాను సైతం అయోధ్యలో దీపావళి వేడుకల్లో బాణాసంచా వేడుకల్లో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. పండుగలు జరుపుకునే వారిని ప్రశ్నించే బదులు, వ్యవస్థను కలుషితం చేస్తున్న వారిని కూడా ప్రశ్నించాలని యూపీ సీఎం ఆదిత్యనాథ్ హితవు పలికారు.

