కలం, వెబ్ డెస్క్ : విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రైవసీ కోరుకుంటున్నప్పటికీ, తనపై వచ్చే విమర్శల పట్ల అతను చాలా సున్నితంగా స్పందిస్తాడని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026లో కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నప్పటికీ, మంజ్రేకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మంజ్రేకర్, కోహ్లీపై ఏదైనా ప్రతికూల వ్యాఖ్యలు వస్తే ఆయనకు వెంటనే తెలిసిపోతుందని చెప్పారు. గతంలో తాను కామెంటేటర్‌గా ఉన్న సమయంలో కోహ్లీ ప్రవర్తనలో వచ్చిన మార్పులను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. విమర్శలు విన్నప్పుడు కోహ్లీ టాస్ సమయంలో కోపంగా కనిపించేవారని తెలిపారు. అయితే అదే విమర్శలు అతడిని తర్వాతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టేలా ప్రేరేపిస్తాయని ఆయన విశ్లేషించారు.
కోహ్లీ కెప్టెన్సీ శైలిపై కూడా మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ నాయకత్వంలో జట్టు కూడా అతని దూకుడైన శైలిని అనుసరించేదని చెప్పారు. మైదానంలో ఎవరైనా నిరుత్సాహంగా కనిపిస్తే వారికి తర్వాత మ్యాచ్‌లో అవకాశం ఇవ్వకపోవడం కూడా కోహ్లీ విధానమని తెలిపారు. మ్యాచ్ పరిస్థితులు ఎలా ఉన్నా జట్టులో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవడమే అతని నాయకత్వ బలం అని ప్రశంసించారు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, ప్రస్తుతం ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లలో 163 స్ట్రైక్ రేట్‌తో 379 పరుగులు చేశారు. గత రెండు మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, అంతకుముందు భారీ స్కోర్లు నమోదు చేశారు. ఆర్సీబీ ఈ సీజన్‌లో 11 మ్యాచ్‌లలో 7 విజయాలతో మంచి ఫామ్‌లో కొనసాగుతోంది.

