కలం, మెదక్ బ్యూరో: రోడ్లపై ధాన్యం ఆరబోయడం వలన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా, ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ (SP Paritosh Pankaj) తెలిపారు. ఈ నేపథ్యంలో రహదారులపై ధాన్యం ఆరబోసి రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రైతులు తమ ధాన్యాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన నిర్దిష్ట కల్లాల్లో లేదా వ్యవసాయ శాఖ సూచించిన ప్రదేశాల్లోనే ఆరబోసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ కోరారు. కొంతమంది రైతులు, వ్యాపారులు హైవేలు, సర్వీస్ రోడ్లపై ఇష్టవచ్చినట్లు ధాన్యం ఆరబోస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం సరిగా కనిపించక వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. రైతులు, వ్యాపారులు ధాన్యం ఆరబోయడంలో బాధ్యతగా ఉండాలని సూచించారు.

