కలం, మెదక్ బ్యూరో: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకంగా బుధవారం సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో న్యూ బస్టాండ్ ఎదురుగా సంయుక్త కిసాన్ మోర్చా (Samyukt Kisan Morcha) ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం అమెరికా, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్ తదితర దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAs) భారత వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పాడి పరిశ్రమ, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, సూక్ష్మ–చిన్న–మధ్యతరహా పరిశ్రమలు (MSMEs), దేశ ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పు అని అన్నారు.
ఈ ఒప్పందాల వలన విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్‌ను ఆక్రమించడం, దేశీయ పంటలకు గిట్టుబాటు ధరలు పడిపోవడం, రైతుల జీవనోపాధి నాశనం కావడం, విత్తనాలపై బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యం పెరగడం, నిరుద్యోగం పెరిగిపోవడం వంటి పరిణామాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలని లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతులను సమీకరించి పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం నర్సింహులు, CITU నాయకులు సురేష్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

