ఆడపిల్లల పాలిట శాపంగా స్మార్ట్ ఫోన్స్: సజ్జనార్

కలం, వెబ్ డెస్క్: ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా స్మార్ట్‌ఫోన్ మారుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ (VC Sajjanar) అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి విషాదకర ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయని.. అవి ఎంతగానో బాధిస్తున్నాయని చెప్పారు. సైబర్ నేరగాళ్లు (Cyber ​​criminals) అందమైన యువకులు/సినీ నటుల ఫోటోలను డీపీలుగా పెట్టుకుని ఫేక్ అకౌంట్లతో అమ్మాయిలకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి వాటిలో ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని.. ఆ మాయమాటలకు ఆకర్షితులై కొందరు ఆడపిల్లలు తమ వ్యక్తిగత ఫోటోలను, వీడియోలను పంచుకుంటున్నారని తెలిపారు. వ్యక్తిగత డేటాను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారని చెప్పారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధింపులకు గురిచేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

ఇంట్లో చెప్పలేక, పరువు పోతుందని కొందరు అమ్మాయిలు అడిగినంత డబ్బులు ముట్టజెబుతూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ వేధింపులు తాళలేక కొందరు తమ ప్రాణాలను సైతం తీసుకుంటున్నారని తెలిపారు. ఆడపిల్లలకు తాను చేసే విజ్ఞప్తి ఒక్కటేనని.. ఆన్‌లైన్‌లో ఇలాంటి సమస్య లేదా అన్యాయం ఎదురైతే అస్సలు భయపడొద్దని దైర్యం కల్పించారు. ఆ సైబర్ నేరగాళ్ల బ్లాక్ మెయిలింగ్‌కు లొంగవద్దని చెప్పారు. ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని.. ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. పోలీసులు తమకు అండగా ఉండరని హామీ ఇచ్చారు. ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ నెంబర్లు, వీపీఎన్‌లు వాడితే పోలీసులకు దొరకబోమని సైబర్ నేరగాళ్లు భ్రమపడొద్దని హెచ్చరించారు. నేరస్తులు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆడపిల్లలు సోషల్ మీడియాలో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>