మెడికల్ సీట్ల పేరిట దోపిడీ.. సజ్జనార్ హెచ్చరిక!

కలం, వెబ్ డెస్క్: మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ కేటుగాళ్లు వల వేసే ప్రమాదం ఉందని, అలాంటి వారి పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) హెచ్చరించారు. నీట్ యూజీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి కీలక ప్రకటన విడుదల చేశారు. నీట్‌లో తక్కువ మార్కులు వచ్చినా మేనేజ్‌మెంట్ కోటాలో తక్కువ ధరకే ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని దళారులు నమ్మిస్తారని వివరించారు. అవసరమైతే ఫిలిప్పీన్స్, కిర్గిజిస్థాన్, కజకిస్థాన్, జార్జియా, చైనా, అర్మేనియా, కరేబియన్ వంటి దేశాలకు పంపించి, అతి తక్కువ ఖర్చుతోనే వైద్య విద్య పూర్తి చేయవచ్చని నమ్మబలుకుతుంటారని వివరించారు.

చెక్ చేసుకున్నాకే చేరాలి…

మెడికల్ సీట్లు ఇప్పిస్తామంటూ కొన్ని ముఠాల చేతికి చిక్కి ఎందరో తల్లిదండ్రులు డబ్బులు పోగొట్టుకున్న ఉదంతాలు గతంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగాయని సీపీ సజ్జనార్ వివరించారు. కేటుగాళ్లను నమ్ముకుని విద్యార్థులు తమ విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయినట్లు తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు ముందు తాము చేరాలనుకుంటున్న యూనివర్సిటీ గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నారు. దానికి భారత ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) గుర్తింపు ఉందో లేదో అధికారిక వెబ్‌సైట్‌ లేదా మీరే స్వయంగా సంప్రదించి తెలుసుకోవాలని సూచించారు.

ముందే డబ్బులు ఇవ్వొద్దు..

అడ్మిషన్ల పేరుతో దళారుల చేతికి లక్షలాది రూపాయలు ఇవ్వొద్దని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఫీజులు ఏవైనా ఉంటే నేరుగా యూనివర్సిటీ లేదా కాలేజీ బ్యాంక్ ఖాతాలకే చెల్లించడం ఉత్తమమన్నారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి సాధించిన ఫలితాలను, నకిలీ ఏజెంట్ల చేతుల్లో పెట్టి ఆందోళనకు గురికావద్దన్నారు. ఎంబీబీఎస్ సీట్ల పేరుతో ఎవరైనా సంప్రదించినా, డబ్బుల కోసం వేధిస్తున్నా వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>