కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (Telangana LRS) ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు నవంబర్ 30 వరకు అవకాశం కల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న 25 శాతం రాయితీని కూడా కొనసాగించాలని సర్కార్ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ గడువును పలుమార్లు పొడిగించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఇప్పటికే దాఖలైన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పూర్తిస్థాయిలో సాగకపోవడంతో కొత్త దరఖాస్తులపై ఆసక్తి తగ్గిందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు మరో ఛాన్స్ ఇస్తూ గడువును మరోసారి పొడిగించినట్లు తెలుస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ ప్రక్రియను ప్రకటించగా.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనిపై కీలక సవరణలు చేసింది. గత ఏడాది మార్చిలో క్రమబద్ధీకరణ ఫీజుపై తొలుత 50 శాతం, తర్వాత 25 శాతం రాయితీ ప్రకటించింది. ఈ రాయితీ ప్రకారం దరఖాస్తుదారులు చెల్లించాల్సిన మొత్తంలో 25 శాతం మినహాయింపు పొందుతూ మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తే క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది.

