కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం (RTI) ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో శుక్రవారం సమాచార హక్కు చట్టం – 2005 పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్‌లు కూడా హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సమాచారం అందుబాటులో ఉండాలి
ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలో సమాచారం ప్రజలకు సంబంధించినదే కాబట్టి దానిని వారికి తెలుపడంలో అలసత్వ వైఖరి తగదని హితవు పలికారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రజాసేవకులం అన్న విషయాన్ని మరువరాదని సూచించారు. ఈ సందర్భంగా ఆయన సమాచార హక్కు చట్టంలోని 2 షెడ్యూళ్ళు, 6 చాప్టర్లు, 31 సెక్షన్ల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
సమాచార హక్కు చట్టంపై అవగాహన
సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సంబంధించి పీఐఓలు, ఏపీఐవోల సందేహాలను నివృత్తి చేశారు. థర్డ్ పార్టీ ఇన్ ఫర్మేషన్, వ్యక్తిగతంగా అడిగే సమాచారం, ఇవ్వవలసిన సమాచారం, ఇవ్వకూడని సమాచారం, తదితర వాటి గురించి సవివరంగా తెలియజేశారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. సమాచార చట్టం ప్రకారం సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరునికి ఉండడంతో పాటు, రికార్డులను, క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించే అధికారం కూడా ఉందని తెలిపారు. పౌరులు కోరినప్పుడే సమాచారం ఇవ్వడం కాకుండా, సమాచార హక్కు చట్టం, సెక్షన్ 4(1)బి ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా అధికార యంత్రాంగం సమాయత్తం కావాలని సూచించారు. పబ్లిక్ అథారిటీ బాధ్యతలు, విధులు, నిర్వర్తించే పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు 4(1) బి రిజిస్టర్లను అప్డేట్ చేసుకోవాలని, వీటన్నిటిని ప్రజలకు తెలిసేవిధంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
లక్షమందికి సమాచారం అందించాం
రాష్ట్ర వ్యాప్తంగా సమాచార హక్కు చట్టం (RTI) లక్ష మందికి సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. మరో 15000 వరకు అప్పీల్స్ రాష్ట్ర సమాచార కమిషన్ కు వస్తున్నాయని వివరించారు. ఇప్పటివరకు 20 జిల్లాలలో రాష్ట్ర సమాచార కమిషన్ పర్యటించిందని, సుదీర్ఘ కాలం నుండి పెండింగ్ లో ఉన్న పాత కేసులు అన్నింటిని పరిష్కరించడం జరిగిందని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా పౌరులు కోరుకున్న సమాచారాన్ని పొందే అవకాశం ఉన్నందున పిఐఓలు, అధికార యంత్రంగాలు ప్రజల పక్షాన ఆలోచించి అడిగిన సమాచారాన్ని ఇవ్వాల్సిన గురుతర బాధ్యత వారిపై ఉందని అన్నారు.
ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులను ఆర్టీఐ కమిషన్ చీఫ్ కమిషనర్, కమిషనర్లు పరిశీలించి పరిష్కరించారు. సదస్సుకు హాజరైన రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి, కమిషనర్లు దేశాల భూపాల్, పీవీ శ్రీనివాస్ రావులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఇతర జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. సదస్సులో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రం సింగ్, అదనపు డీసీపీ ప్రకాశ్, డీఆర్వో బీ గీత, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: గ్రేటర్‌లోకి 3 వేల ఈవీ బస్సులు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat

