జనగామ డిపో వద్ద ఆవేదన.. పోలీసుల కాళ్లపై పడ్డ కార్మికుడు

కలం, జనగామ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జనగామ (Jangaon) జిల్లా కేంద్రంలో గురువారం అత్యంత ఉద్వేగభరితమైన, హృదయ విదారక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా పోరాటం చేస్తున్న కార్మికులను అడ్డుకోవద్దని వేడుకుంటూ ఓ కార్మికుడు (RTC Worker) పోలీసుల కాళ్లపై పడటం అక్కడున్న వారందరినీ కలచివేసింది. జనగామ ఆర్టీసీ డిపో ఎదుట రెండో రోజు కూడా కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు భారీగా మోహరించారు. ఇదే సమయంలో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లను తీసుకువచ్చి బస్సులను నడిపించే ప్రయత్నం చేసింది.

డిపో నుంచి బస్సులు బయటకు వెళ్లే క్రమంలో ప్రతి బస్సుకు పోలీసుల భద్రత కల్పిస్తూ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిని చూసి ఆవేదన చెందిన ఓ కార్మికుడు (RTC Worker) పోలీసుల కాళ్లపై పడుతూ, ‘అయ్యా.. మీ కాళ్లు మొక్కుతాం, మా పొట్ట కొట్టకండి.. మా సమ్మెను అడ్డుకోవద్దు’ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన అక్కడ ఉన్న వారిని కదిలించింది. కార్మికులను పోలీసులు పక్కకు నెట్టివేస్తూ బస్సులను పంపించే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ జీవనోపాధి కోసం చేస్తున్న పోరాటంలో పోలీసుల జోక్యం అన్యాయమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జనగామ ఆర్టీసీ డిపో పరిసరాలలో భారీగా పోలీసులు మోహరించి, పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు.

Read Also: సింగరేణి ఉద్యోగులకు ఎస్బీఐతో కొత్త బీమా ఒప్పందం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>