Mobile Popup Ad
Mobile Popup Ad

గల్ఫ్ కార్మికులపై యుద్ధం ఎఫెక్ట్.. విమాన చార్జీలకు రెక్కలు

కలం, నిజామాబాద్ బ్యూరో : గల్ఫ్ దేశాల విమాన టికెట్ల ధరల (Flight Ticket Charges)కు రెక్కలు వచ్చాయి.. యుద్ధ పరిస్థితులు కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణం. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారు అక్కడి నుంచి ఇండియాకు వచ్చే వారి ప్రయాణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రెండు, మూడింతలు చార్జీలు పెరగడంతో నానా కష్టాలు పడాల్సి వస్తోంది.

పశ్చిమాసియాలో శాంతి చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడం గల్ఫ్ దేశాలకు వెళ్లే వలస కార్మికులకు శాపంగా మారుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బహ్రెయిన్, కువైట్ మినహా ఇతర గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల టికెట్ ధరలు (Flight Ticket Charges) అమాంతం రెండు నుంచి మూడు రెట్లు పెరిగిపోయాయి. విమానయాన సంస్థలు ఊహించని విధంగా చార్జీలను పెంచడంతో వలస కార్మికులు అధిక ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా దేశాలకు చార్జీలు సాధారణం కన్నా ఎక్కువగా పెరిగాయి. బహ్రెయిన్, కువైట్ దేశాలకు ఇంకా విమాన సర్వీసులు పునఃప్రారంభం కాలేదు. విమానయాన సంస్థలపై నియంత్రణ లేకపోవడంతోనే చార్జీలను రెండు, మూడింతలుగా పెంచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాల్లో ఎక్కువ సంఖ్యలో వలస కార్మికులే ఉంటారు. విదేశాంగ శాఖతో పాటు పౌర విమానయాన మంత్రిత్వ శాఖలు స్పందించి వలస కార్మికులపై ఆర్థిక భారం తగ్గించేలా చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన వారిలో నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి ఎక్కువగా ఉంటారు. యుద్దాలు జరిగిన ప్రతీ సారి ఆయా దేశాల్లో ఉన్న తెలంగాణ వాళ్లు నానా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈసారి పశ్చిమాసియా పరిస్థితులతో కూడా పనులు లేక చాలా రోజులు ఖాళీగా ఉండాల్సి వచ్చింది. పని లేక వేతనాలు కూడా కట్ అయ్యి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని విమాన టికెట్ల ధరలు పెరగకుండా చూడాలని వలస జీవులు కోరుతున్నారు.

ఆయా దేశాలకు విమాన చార్జీలు
సాధారణ రోజుల్లో..

యూఏఈ : రూ.11వేల నుంచి రూ.13వేలు

ఒమన్ : రూ.6వేల నుంచి రూ.12 వేలు

ఖతర్ : రూ.12వేల నుంచి రూ.20వేలు

సౌదీ : రూ.12వేల నుంచి రూ.15 వేలు

ప్రస్తుతం ధరలు..

యూఏఈ : రూ .28 వేల నుంచి రూ.33 వేలు

ఒమన్ : రూ .20వేల నుంచి రూ.30వేలు

ఖతర్ : రూ .40వేల నుంచి రూ.50వేలు

సౌదీ : రూ .20వేల నుంచి రూ.25వేలు

Read Also: సింగరేణి ఉద్యోగులకు ఎస్బీఐతో కొత్త బీమా ఒప్పందం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>