కలం, కరీంనగర్ బ్యూరో: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకి చేరడంతో కరీంనగర్ (Karimnagar) బస్టాండ్‌లో ప్రయాణికుల ఇబ్బందులు మరింత పెరిగాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్‌లోనే వేచి చూస్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, అత్యవసర పనుల కోసం బయలుదేరినవారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె కారణంగా పలు రూట్లలో బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆందోళన చెందుతున్నారు.
గమ్య స్థానాలకు చేరేందుకు ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. మరోవైపు, కొన్ని చోట్ల ప్రైవేటు డ్రైవర్లను పెట్టి బస్సులను నడిపిస్తున్నట్లు సమాచారం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. బస్టాండ్‌లో సరైన సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. ఎప్పుడు బస్సులు నడుస్తాయో స్పష్టత లేకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం స్పందించి సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సమ్మె కొనసాగితే పరిస్థితి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: కాళేశ్వరంపై దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం: BRS నాయకులు
Follow Us On : WhatsApp

