కలం, నిజామాబాద్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు (BRS Leaders) పేర్కొన్నారు. నిజామాబాద్ (Nizamabad) జిల్లా వేల్పూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు నాగంపేట్ శేఖర్ రెడ్డి, మాజీ డీసీసీబీ డైరెక్టర్ రాజా పూర్ణనందం, మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడారు. గత రెండున్నరేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఈ తీర్పు పూర్తిగా ఖండించిందన్నారు. ఈ తీర్పుతో తెలంగాణ ప్రజలకు, రైతులకు అసలు నిజం తెలిసిందని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం అయిన ఖర్చు సుమారు రూ. 94 వేల కోట్లు అయితే , లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల అజ్ఞానానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే SRSP పునరుజ్జీవం (కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ) ప్రాజెక్ట్ నిర్మించారని అన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకతీయ కాలువ, వరద కాలువల ద్వారా నీటి సరఫరా నిలిచిపోయిన సందర్భంలో బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో పంటలు ఎండిపోకుండా ఈ ప్రాజెక్టు వల్ల కాపాడిందని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) చొరవతో రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు నీరు అందించగలిగామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన రివర్స్ పంపింగ్ లేకుంటే వరద కాలువకు నీళ్లు ఎక్కడ నుండి వచ్చేవో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేవలం కేసీఆర్‌ను బద్నాం చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టును నిరుపయోగం చేస్తోందని విమర్శించారు. కుంగిపోయిన రెండు పిల్లర్లకు మరమ్మతు చేయకుండా, రాజకీయ లబ్ధి కోసం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడం కాంగ్రెస్, బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నాయని విమర్శించారు. ఘోష్ కమిషన్ నివేదికను కోర్టు తిరస్కరించడంతో, కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైందని తెలిపారు.
ఈ తీర్పును తెలంగాణ రైతాంగ విజయంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలను మానుకుని, కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు (BRS Leaders) కల్లెడ ఏలీయా, రేగుల్లా రాములు, సత్యం, దయాకర్, రవి, సుంకరి రాములు, మోహన్ దాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: నేపాల్ లో మళ్లీ నిరసనలు.. ఇద్దరు మంత్రులు రాజీనామా!
Follow Us On: Instagram

