కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల (Chevella) మండలం మల్కాపూర్ సమీపంలో యూటర్న్ వద్ద ఆర్టీసీ బస్సు, బ్రిజా కారు ఢీకొన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాద సమయంలో కారులో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కావడం, అలాగే ఆర్టీసీ బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.
ఘటన సమయంలో ఆర్టీసీ బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వారందరినీ వెంటనే సురక్షితంగా ఇతర బస్సులలో వారి గమ్యస్థానాలకు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

