కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, పాల్వంచ మండలం, జగన్నాధపురం (Jagannadhapuram) గ్రామంలో జరిగిన అమానుష ఘటన సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసింది. జన్మనిచ్చిన తల్లినే కామవాంఛతో చూడటం, చివరకు అత్యాచారానికి ప్రయత్నించడం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గ్రామానికి చెందిన బానోత్ పవన్ అనే వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో మద్యం మత్తులో ఇంటికి చేరుకుని తన కన్న తల్లిపైనే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. తల్లి కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు అక్కడికి చేరుకుని నిందితుడిని కట్టిపడేసారు.
తల్లిని దేవతగా భావించే భారతీయ సంస్కృతికి మచ్చ తెచ్చేలా ఈ ఘటన చోటుచేసుకోవడం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. మద్యం మత్తు, వికృత మనస్తత్వం మనిషిని ఎంతటి పశువుగా మార్చేస్తుందో ఈ ఘటన మరోసారి బయటపెట్టిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు బానోత్ పవన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. “కన్న తల్లిపైనే అత్యాచారం చేసే స్థాయికి దిగజారిన నిందితుడికి అత్యంత కఠిన శిక్ష విధించాలి. ఇలాంటి వారిని సమాజంలో తిరగనివ్వకూడదు” అంటూ స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

