పేదల పొట్టగొడుతున్న విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి: RSP

కలం, వెబ్ డెస్క్: పేదల పొట్టగొడుతున్న విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో విద్యా, మైక్రో ఇండస్ట్రీస్ రంగంలో అన్ని రంగాల్లో న్యాయం జరిగిందని.. 12 వేల మంది చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు కేసీఆర్ న్యాయం చేశారని కొనియాడారు. ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ (BC Declaration), చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ విడుదల చేసిందని చెప్పారు.

ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్టులలో బీసీలకు 42 శాతం, ఎస్సీలకు 18 శాతం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ డిక్లరేషన్లలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రెండేళ్ల 4 నెలల కాంగ్రెస్ పాలనలో ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. ఈ రిజర్వేషన్లు అమలు చేయలేదు సరికదా.. జీవో 17 (GO 17) తెచ్చి చిన్న కాంట్రాక్టర్ల పొట్టగొడుతోందని మండిపడ్డారు. ఈ జీవో ప్రకారం స్కూళ్లు, గురుకులాల్లో వస్తువుల సరఫరాకు జాతీయ సంస్థలను టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించిందని.. ఇందులో రూ. 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.

తుగ్లక్ లాగా ఆలోచిస్తోన్న ప్రభుత్వం..

స్థానికంగా ఉన్న చిన్న కంపెనీలను దెబ్బ కొట్టి తమ అస్మదీయ కంపెనీలకు విద్యారంగ కాంట్రాక్టులు ఇవ్వాలనేది రేవంత్ సర్కార్ కుట్రగా కనిపిస్తోందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టు జీవో 17ను మార్చాలని చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో చెప్పిన సామాజిక న్యాయం ఇదేనా? అంటూ ఎద్దేవా చేశారు. తుగ్లక్ లాగా ఈ ప్రభుత్వం దుర్నీతితో ఆలోచిస్తోందన్నారు. ఏవైనా అభ్యంతరాలు చెప్పాలంటే కూడా కాంట్రాక్టర్‌కు వివిధ మొత్తాల్లో డీడీలు కట్టాలని విచిత్రమైన నిబంధన పెట్టారని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, గిరిజన, మైనారిటీ కార్పొరేషన్లకు ఈ టెండర్లలో ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు.

ఏఐసీసీకి ఎటీఎంలుగా బడా కాంట్రాక్టర్లు..

ఏఐసీసీ (AICC)కి బడా కాంట్రాక్టర్లను ఎటీఎంలుగా మార్చారని ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే ఈ జీవో 17 తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే జాతీయ కాంపిటీటివ్ బిడ్డింగ్ అంటూ తెచ్చిన జీవో 17 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొక్యూర్‌మెంట్ పాలసీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కర్ణాటకలో ప్రొక్యూర్‌మెంట్ పాలసీలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పించారని.. ఇక్కడెందుకు కల్పించరు? అక్కడో న్యాయం ఇక్కడో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. ప్రొక్యూర్‌మెంట్ పాలసీలో సామాజిక న్యాయం విస్మరించడాన్ని నిరసిస్తూ సీఎంకు లేఖ రాస్తానని చెప్పారు.

Read Also: జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>