కలం, వెబ్ డెస్క్: ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజనంపై విమర్శలు చేసిన ప్రవచనకర్త గరికపాటి నరసింహా రావు (Garikapati Narasimha Rao)పై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా గరికపాటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఎక్స్ వేదికగా స్పందించారు. గరికపాటిలాంటి వారిని జైలులో వేయాలంటూ ఆర్ఎస్పీ ఘాటుగా స్పందించారు. గరికపాటి తన మనసులో మాటను చెప్పాడని, నిజానికి ఈ సమాజంలో చాలా మంది ఆధిపత్య వర్గాల పెద్దలకు, మేధావులకు తరతరాలుగా పేద వారి చదువులు, తినే తిండి మీద చులకన భావమే ఉంటుందని పేర్కొన్నారు. దీనికి తన దగ్గర వందల ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కొందరు పైకి నటిస్తారని, ఈయన నటించలేదని స్పష్టం చేశారు.
గరికపాటిలాంటి వారు ఉన్నారు కకాబట్టే దేశంలో పేదరికం, వివక్ష నేటికీ పోవడం లేదన్నారు. రోహిత్ వేములలాంటి వారు బలవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గరికపాటి గడ్డి మాటలను ప్రశ్నించకుండా చప్పట్లు కొడుతున్న మూర్ఖులను చూస్తే జాలేస్తుందని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల దళిత ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి మీద కోడి గుడ్ల దాడి చేసిన బండి సంజయ్, బీజేపీ గ్యాంగ్ ఇప్పుడు బ్రాహ్మణ వర్గానికి చెందిన గరికపాటి ఇంటికి వెళ్తారా అని ప్రశ్నించారు. వారు ముమ్మాటికీ అలా వెళ్లరని, పోలీసులు కూడా కేసులు పెట్టరని. జాతీయ బాలుర సంఘం, మానవహక్కుల సంఘం కూడా గరికపాటిని పిలవదని చెప్పారు.
పేద పిల్లలు పోషకాహారం తినకుండా అస్థిపంజరాలుగా మారి, బీజేపీ, కాంగ్రెస్ జెండాలు మోసే రోబోలుగా మారి గరికపాటిలాంటి వారి ప్రసంగాలకు చప్పట్లు కొడుతూ, ఓట్లేస్తూ ఉంటే చాలు అని అభిప్రాయపడుతున్నారని మండిపడ్డారు. గరికపాటి, అతని లాంటి వారిపై కేసు పెట్టి చంచల్ గూడ ‘అండా’ సెల్‌లో వేయాలన్నారు. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో విజ్ఞానం వికసిస్తుందని పేర్కొన్నారు.

