కలం, వెబ్ డెస్క్: బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి.. నువ్వు కూడా ఒక అమ్మాయికి తండ్రే కదా? మంత్రులు సీతక్క, కొండ సురేఖ మీరు తల్లులే కదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీతో మాట్లాడి బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తీసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక ఆడపిల్ల తండ్రి అని.. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పోలీసు ఉన్నతాధికారులని పిలిపించి ఈ అంశంపై సమీక్ష చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఎం మోదీ సమావేశానికి హాజరై ఏకంగా పోక్సో నిందితుడి తండ్రితోనే కూర్చొని తన ప్రియమైన మిత్రుడు బండి సంజయ్ అంటడని దుయ్యబట్టారు. బండి సంజయ్ ని ముందు బర్తరఫ్ చేస్తేనే మీ మీటింగ్‌కి రాగలనని ప్రధాని మోదీకి చెప్తే మైనర్ బాలికకు న్యాయం జరిగేదని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం ఇజ్జత్ అంతా పోయింది కదా! అంటూ దుయ్యబట్టారు.
బాధితురాలి తల్లి వేడుకుంటోంది..
“నేను తల్లిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా.. నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి” అని బాధితురాలి తల్లి తనను వేడుకుందని అన్నారు. మైనర్ బాలిక వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా బీజేపీ సోషల్ మీడియా ఇష్టమొచ్చినట్లు ఫోటోలు పెట్టి దుష్ప్రచారాలు చేస్తుంటే ఆ బిడ్డ తల్లడిల్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అమ్మగా పిలిపించుకోవాలనుకుంటున్న కల్వకుంట్ల కవితకు బండి భగీరథ్ పోక్సో కేసులో బాధితురాలి అమ్మ బాధ కనిపించట్లేదా? అని ఫైర్ అయ్యారు.ఒక మరమనిషి లాగా రేవంత్ రెడ్డి, బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్‌ను కవిత చదువుతుందని ఆరోపించారు.
పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న బండి భగీరథ్ పరారీలో ఉన్న నేపథ్యంల మారువేషాల్లో ఉంటే ఎలా ఉంటాడన్న ఫోటోలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విడుదల చేశారు. భగీరథ్ కనిపిస్తే 1098 చైల్డ్ ప్రొటెక్షన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. POCSO కేసులో నిందితుడు బండి భగీరథ్ కనిపించడం లేదని.. ఈ ఫోటోలలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనబడితే దయచేసి 1098 నంబర్‌కు కాల్ చేయాలని.. లేదా 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఈ విషయం మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కానీ తాము చెప్తున్నామని అన్నారు.

