కలం, వెబ్‌డెస్క్: గత పదేళ్లలో ప్రధాని మోదీ (Modi) పాలనలో దేశంలో 93 పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ (NEET)- యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్, పరీక్ష రద్దు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ నిర్ణయానికి సాక్ష్యమని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష రద్దుతో విద్యార్థుల భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. నీట్ రద్దుతో రెండు కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు. పేపర్ లీక్ జరిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని సీఎం విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి నీట్ రద్దును పెద్ద నోట్ల రద్దుతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరీక్ష రద్దు దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కేంద్రం అనాలోచిత, నిర్లక్ష్యపు నిర్ణయం దేశ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందన్నారు. పేపర్ లీక్‌లు, ప్రభుత్వ వైఫల్యాలు దేశ యువతను తీవ్ర అనిశ్చితి, నిరాశలోకి నెట్టాయని చెప్పారు. తీవ్ర ఒత్తిడిలో సంవత్సరాల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థుల కలలు మోదీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం కల్లలయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, కొంతమంది పేరెంట్స్ నగలు అమ్మి తమ పిల్లలను నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ చేయించారని… వారి ఆశలన్నీ గల్లంతవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 నుండి 15 రాష్ట్రాల్లో ప్రధాన నియామక పరీక్షల పేపర్లు లీక్ అయినా, ఒక్క కేంద్ర మంత్రి కూడా రాజీనామా చేయలేదని గుర్తు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలే ఈ లీక్‌లకు ప్రధాన కేంద్రాలుగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్ రాష్ట్రంలోనే 14 పేపర్లు లీక్ అయ్యాయయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
2014 మే నెలలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, భారతదేశంలోని ప్రభుత్వ పరీక్షా వ్యవస్థలో వ్యవస్థీకృత లోపాలు బహిర్గతమయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ విడుదల చేసిన “ది పేపర్ లీక్ డెకేడ్” శ్వేతపత్రం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర పరీక్షలలో 93 పేపర్ లీక్ ఘటనలు జరిగాయని ప్రస్తావించారు. వీటివల్ల సుమారు 2 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమయ్యారన్నారు. 2024లో కేవలం ఎనిమిది వారాల్లోనే నాలుగు ప్రధాన జాతీయ పరీక్షలు రద్దయ్యాయని తెలిపారు. నీట్-యూజీ (24 లక్షల మంది అభ్యర్థులు), యూజీసీ-నెట్ (9 లక్షలు), సీఎస్‌ఐఆర్-నెట్, నీట్-పీజీ రద్దు అయినట్టు గుర్తు చేశారు. 2024లో ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష (16 లక్షల మంది మహిళలతో సహా 48 లక్షల మంది అభ్యర్థులు) కూడా కొన్ని రోజుల్లోనే రద్దైందని, ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో 14 ప్రధాన లీక్‌లు జరిగాయన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా వంటి ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ కుంభకోణాల జాబితాలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టాన్ని ఆమోదించినప్పటికీ, పెద్ద కుంభకోణాలు వెలుగు చూసిన తర్వాత, 2024 జూన్ వరకు దాని నోటిఫికేషన్‌ను కేంద్రం ఆలస్యం చేసిందన్నారు. కాగా తెలంగాణ ముఖ్యమంత్రిగా, విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హామీ ఇచ్చారు. నీట్ రద్దు నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి, వారి కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.

