నిజామాబాద్‌ రింగ్ రోడ్డుపై ఎందుకింత వివక్ష?: ఎమ్మెల్యే ధ‌న్ పాల్ సూర్యనారాయణ

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌ (Nizamabad) పై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ (Congress) సర్కార్ వివక్ష చూపుతోందని నిజామాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ధ‌న్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు జిల్లాలకు రింగ్ రోడ్డు కేటాయించారు కానీ నిజామాబాద్‌కు కేటాయించకపోవడం దురదృష్టకరమని వాపోయారు. రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ అని, అయినా మంజూరు చేయలేదన్నారు. అలాగే రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా స్పెషల్ ఫండ్ మంజూరు కాని నియోజకవర్గం నిజామాబాద్ ఒక్కటేనన్నారు. పక్కనే ఉన్న రూరల్‌కు అందజేస్తున్నారు కానీ ఇందూరుపై వివక్ష చూపుతున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్‌పై ఎందుకింత వివక్ష.. అని ధ‌న్ పాల్ సీఎం రేవంత్‌ను, కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించారు..

ఎన్జీవోస్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ప్రారంభం

ప్రభుత్వంపై ఆధారపడకుండా కాలనీవాసులు ఐక్యతతో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగరంలోని అన్ని డివిజన్లలోకెల్లా అత్యధికంగా వ్యాపారులు, మేధావులు, విద్యావంతులు ఎన్జీవోస్ కాలనీలో ఉన్నారన్నారు. అందరి కృషితోనే అద్భుతమైన నిర్మాణం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ సహకారం కూడా ఉండాలని, తన ఎమ్మెల్యే ఫండ్ వచ్చిన తర్వాత తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు. ఇప్పటికే పాత పనులపై అనేకసార్లు మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. త్వ‌ర‌లో సీఎంని కలిసి నగరాభివృద్ధి కోసం లేఖను అందించనున్నట్లు చెప్పారు. ఎలక్షన్ల ముందే రాజకీయమని, తర్వాత అందరినీ కలుపుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ సహకారంతో కేంద్ర నిధులు పుష్కలంగా అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, సూడా చైర్మన్ కేశ వేణు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, కార్పొరేటర్లు జ్యోతి, మురళి, నాగోల్ల లక్ష్మీనారాయణ, పరమేశ్వర్, మఠం పవన్, ప్రవీణ్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షుడు పోతనకర్ లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు వాసు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>