కలం, వెబ్ డెస్క్: తెలంగాణ గురుకులాల్లో రూ.2,000 కోట్ల కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్ (RS Praveen Kumar) డిమాండ్ చేశారు. గురుకుల స్కూళ్లలో జరుగుతున్నస్కాములపై తాము ప్రశ్నిస్తుంటే.. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు సమాధానం దాటవేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గురుకుల పాఠశాలలకు ట్రంక్ బాక్సుల సరఫరా కాంట్రాక్టును ‘చింతామణి పార్శ్వనాథ్ కంపెనీ’ ఓనర్ నిరంజన్ కుమార్ జైన్‌కు కట్టబెట్టారని ఆరోపించారు.
గతంలో డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు..
ఆయన హెరాయిన్, కొకైన్ వంటి డ్రగ్స్ సరఫరా చేసే ‘టోనీ’ అనే డ్రగ్స్ ముఠా నాయకుడితో 30 సార్లు మాట్లాడినట్లు గతంలో డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారని అన్నారు. ఇలాంటి డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న వ్యక్తికి గురుకులాల కాంట్రాక్టులా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారికి కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వారికి కాంట్రాక్టు ఇస్తే పిల్లలకు ట్రంక్ బాక్సులు సరఫరా చేస్తాడా? లేక వాటి ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తాడా? దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ ఫైర్..
తన భద్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించడంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే.. తనకు సెక్యూరిటీ తగ్గించారని అన్నారు. తన భద్రత తగ్గించినా.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రభుత్వం భద్రతను తగ్గించడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గించడం దుర్మార్గ చర్య అని మండిపడ్డారు.
అటు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తగ్గించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆయనపై ఇలాంటి చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకుని, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కు తగిన భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

