కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో రీజినల్ రింగ్ రోడ్డు (RRR) భూసేకరణ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయమై మల్లాపురం గ్రామ మాజీ సర్పంచ్ కర్రే వెంకటయ్య బాధితులతో కలిసి కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మల్లాపురం సర్వే నెంబర్ 438లో కురుమ కులస్తులకు చెందిన సుమారు 250 ఎకరాల భూమిలో 15 ఏళ్ల క్రితమే ‘టీ వెంచర్’ పేరుతో లేఅవుట్ చేసి ప్లాట్లను విక్రయించారు. ఇందులో ప్రస్తుత సర్పంచ్ మంగ సత్యనారాయణ కుటుంబ సభ్యులకు చెందిన భూములను సైతం పలు డాక్యుమెంట్ల ద్వారా విక్రయించారు. గతంలో భువనగిరి ఆర్డీఓగా పనిచేసిన కిష్టప్ప జీవో నెంబర్ 38E ద్వారా వీరికి హక్కు పట్టాలు కల్పించగా, వీటిపై నవాబు కుటుంబ సభ్యులు హైకోర్టులో వేసిన దావా ప్రస్తుతం విచారణలో ఉంది.
వెంచర్ లేఅవుట్ సమయంలో నిబంధనల ప్రకారం 10 ఎకరాల స్థలాన్ని మల్లాపురం గ్రామపంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ట్రిపుల్ ఆర్ (RRR) నిర్మాణం సరిగ్గా ఈ గ్రామపంచాయతీకి కేటాయించిన 10 ఎకరాల స్థలంలోంచే వెళ్తోంది. గ్రామపంచాయతీ స్థలాన్ని కాపాడాల్సింది పోయి, ప్రస్తుత సర్పంచ్ మంగ సత్యనారాయణ తన కుటుంబ సభ్యుల స్థలం గుండా రోడ్డు వెళ్తోందంటూ యాదగిరిగుట్ట ఎంఆర్ఓకు రూ. 20 లక్షల లంచం ఇచ్చి కలెక్టర్కు తప్పుడు నివేదిక పంపించారని కర్రే వెంకటయ్య ఆరోపణలు చేశారు. గతంలో ప్లాట్లు కొనుగోలు చేసిన కస్టమర్ల పేర్లు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడంతో, పాత యాజమాన్యాల పేరిట మళ్లీ పాస్ పుస్తకాలు రావడం ఈ వివాదానికి కారణమైందని తెలిపారు.
ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని టీ వెంచర్ యాజమాన్యం, సర్పంచ్ కుటుంబం కుమ్మక్కయ్యారని.. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలోనే ఒప్పందాలు కుదుర్చుకుని, వచ్చే పరిహారంలో సగం వాటా ఎమ్మెల్యేకు, సగం సర్పంచ్ కుటుంబానికి పంచుకునేలా డీల్ చేసుకున్నారని వినతిపత్రంలో ఆరోపించారు. ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయిన మధ్యతరగతి వినియోగదారులకు, అలాగే గ్రామపంచాయతీ ఆస్తికి న్యాయం చేయాలని మాజీ సర్పంచ్ కర్రే వెంకటయ్య డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

