కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతాంగాన్ని రేవంత్ సర్కార్ రైతు బంధు, రైతు బీమా పేరుతో మోసం చేసిందని బీఆర్ ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు ఎప్పుడైనా ఆగిందా అని ప్రశ్నంచారు. ఈ రెండున్నరేండ్లలో ఒక్కరికైనా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సాయం అందించారా? అని అడిగారు. ఎస్టీలకు బడ్జెట్ లో రూ.2730 కోట్లు పెట్టామని చెబుతున్నారు.. కానీ ఎస్టీలకు వచ్చింది మాత్రం సున్నా అంటూ విమర్శించారు. ఈ ప్రభుత్వం గొల్లకురుమలు, గౌడన్నలు, మత్సకారులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ప్రజలకు చేరవేస్తూ బీఆర్ఎస్ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేస్తోందని కొనియాడారు. తమ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన ఏ ఒక్కరిని విడిచిపెట్టమని హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టిన వారు రిటైర్డ్ అయినా, ఎక్కడ దాక్కున్నా పట్టుకొస్తామని.. క్రిమినల్ యాక్షన్ తీసుకుని తగిన శిక్ష విధిస్తామని చెప్పారు.
రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తాం..
రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి, కేంద్రం చెబితేనే పంటలు కొంటామంటున్న రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పక్కా మోసగాడు అంటూ దుయ్యబట్టారు. పేదలకు ఇవ్వడానికి పైసల్లేవంటాడు కానీ.. తన గెస్ట్ హౌస్‌కు రూ. 100 కోట్లు, కంచెకు రూ. 17 కోట్లు, పక్క రాష్ట్రాల్లో పేపర్ యాడ్స్‌కు వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని ప్రశ్నించారు. నాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లుగా.. నేడు పెట్రోల్, డీజిల్, ఎరువులు, చార్జీల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల రక్తం తాగుతూ పన్నుల భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొనలేని దద్దమ్మ, బీఆర్ఎస్‌ను మొలకెత్తనివ్వననడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లోనే రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు.

