కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh)తో రోమన్ క్యాథలిక్ బిషప్‌లు(Roman Catholic Bishops), ఛాన్సలర్లు సమావేశమయ్యారు. కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఖమ్మం, ఏలూరు మిషన్ సెంటర్లకు చెందిన బిషప్‌లు, ఛాన్సలర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. గత ముప్పై ఏళ్లుగా తమ చర్చిల పరిధిలో ఎదుర్కొంటున్న పలు భూ సమస్యలను వారు మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా చర్చిలకు చెందిన భూములపై ఉన్న వివాదాలు, పరిపాలనా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను వివరించారు.
అదే సమయంలో తమ పరిధిలో నడుస్తున్న విద్యాసంస్థలను సందర్శించాలని బిషప్‌లు మంత్రి లోకేశ్‌ను కోరారు. ఈ విద్యాసంస్థలు విద్యా, సామాజిక, సేవా రంగాల్లో చేస్తున్న సేవలను ప్రత్యక్షంగా చూడాలని వారు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందిస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చర్చిలు చేస్తున్న సేవలను ప్రశంసించారు. ప్రభుత్వంతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని బిషప్‌లు తెలిపిన విషయాన్ని స్వాగతించారు.

