కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ (India at UN) మరోసారి ప్రపంచ దేశాల ముందు ఎండగట్టింది. మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రమాదకరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పార్వతనేని హరీష్ హెచ్చరించారు. ముఖ్యంగా భారత్‌కు పశ్చిమ దిశలో ఉన్న పొరుగు దేశం (పాకిస్థాన్), ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు సృష్టిస్తూ అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సొంత దేశంలో అహ్మదీయ ముస్లింలపై జరుగుతున్న అణిచివేతను, నిస్సహాయులైన ఆఫ్ఘన్ శరణార్థులను బలవంతంగా వెనక్కి పంపడాన్ని, పవిత్ర రంజాన్ మాసంలో సాగిస్తున్న వైమానిక దాడులను ఏమని పిలవాలో ఆ దేశం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు.
ముస్లిం దేశాల కూటమి అయిన ఓఐసీ (OIC)ని పాకిస్థాన్ తన స్వార్థం కోసం వాడుకుంటోందని, భారత్‌పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు ఈ వేదికను నిరంతరం వినియోగిస్తోందని భారత్ ఆరోపించింది. జమ్మూ కాశ్మీర్‌తో సహా భారత ముస్లింలందరూ తమ ప్రతినిధులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటున్నారని, వారి తరపున మాట్లాడే హక్కు వేరే ఎవరికీ లేదని హరీష్ స్పష్టం చేశారు. భారత్‌లో అన్ని మతాలు శాంతియుతంగా కలిసి ఉండటాన్ని చూసి భరించలేని వారే లేనిపోని ఫోబియాలను సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఐక్యరాజ్యసమితి తన విలువైన సమయాన్ని, వనరులను మత విద్వేషాలకు కాకుండా, ప్రతి ఒక్కరికీ సమానత్వం, గౌరవం దక్కేలా సమగ్ర సమాజ నిర్మాణానికి వెచ్చించాలని భారత్ కోరింది.

