కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి, ప్రముఖ సీనియర్ నటి రోజా (Roja) ఒక ఛానెల్ ప్రత్యేక షోలో పాల్గొని తన సెకండ్ ఇన్నింగ్స్ ఇండస్ట్రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సదరు షో హోస్ట్ రోజాను ప్రశ్నిస్తూ ప్రస్తుతం మీకు సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం వస్తే టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లలో ఎవరి పక్కన నటించడానికి ఇష్టపడతారు? అని కొన్ని ఆప్షన్లను ఇచ్చారు. దీనికి రోజా స్పందిస్తూ.. ముందు ఆ నలుగురిలో ఎవరు నా పక్కన నటించడానికి ఒప్పుకుంటారో వాళ్ల పేరు చెప్పండి అంటూ నవ్వుతూ ఎదురు ప్రశ్న వేశారు. అయితే ఒకవేళ ఆ నలుగురు హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మీకే ఎంచుకునే అవకాశం ఇస్తే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారని హోస్ట్ మళ్లీ అడగటంతో ఆమె మెగాస్టార్ చిరంజీవి పేరును చెప్పారు.
మిగిలిన ముగ్గురు హీరోల పక్కన కాకుండా చిరంజీవిని (Chiranjeevi) ఎంచుకోవడానికి గల కారణాలను కూడా రోజా (Roja) వివరించారు. తాను వెంకటేష్‌తో కేవలం ఒకే ఒక్క సినిమా చేశానని, అలాగే కింగ్ నాగార్జున అంటే తనకు వ్యక్తిగతంగా ఎంతో ఫేవరెట్ కాబట్టి ఆయన పక్కన నటించలేనని చెప్పారు. మరి నందమూరి బాలకృష్ణ అంటే మీకు ఇష్టం లేదా? అని హోస్ట్ అడగగా.. బాలకృష్ణ ఒక మనిషిగా తనకు ఎంతో ఇష్టమని రోజా స్పష్టం చేశారు. కానీ మళ్లీ వెండితెరపై నటించడానికి మాత్రం మెగాస్టార్ చిరంజీవి సరైన జోడీ అని, ఆయనతో అయితే అద్భుతంగా డ్యాన్స్ చేయొచ్చని రోజా తన మనసులోని మాటను బయటపెట్టారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా బుల్లి తెర, వెండి తెర వైపు ఓ లుక్ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆమెకు అవకాశాలు ఏ మేరకు వస్తాయో వేచి చూడాలి.
Read Also: వేసవిని మరిపించే బెస్ట్ హోంమేడ్ డ్రింక్స్..
Follow Us On: X(Twitter)

