కలం, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ 2027 దగ్గర పడుతున్న కొద్దీ.. టీమిండియాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) , రన్ మెషిన్ కోహ్లీ (Virat Kohli) స్థానంపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. వారి స్థానం ఉంటుందా? ఉండదా? అన్న క్రమంలో.. తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ (Sandeep Patil) సంచలన వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌కు రోహిత్, కోహ్లీ అవసరం లేదని చెప్పాడు. అంతేకాకుండా వాళ్లు ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదని, జట్టుపై, వాళ్ల పర్ఫార్మెన్స్పై ప్రభావం కూడా శూన్యమేనంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ఒకవైపు టీమిండియా బెంచ్ కూడా చాలా బలంగానే ఉందన్న సందీప్.. మరోవైపు ‘రోకో’పై చేసిన కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే రోహిత్, కోహ్లీ.. ఈ మెగా టోర్నీలో ఆడతారా? లేదా? అన్నది అనేక అంశాపై ఆధారపడి ఉంటుందని వివరించారు. వాటిలో వారి ఫిట్నెస్, సెలక్టర్ల ఆలోచన, అసలు వారికి ఆడాలని ఉందా? లేదా? అనేవి కూడా ఉంటాయన్నారు.
‘‘అంతా రోహిత్, కోహ్లీపైనే ఉంది. వాళ్లు ఇంకా ఆడాలనుకుంటున్నారా? ఫిట్నెస్ను మెయింటెయిన్ చేయగలరా. సెలక్టర్ల స్ట్రాటజీ ఏంటి? అనేవి చూడాలి. దాంతో పాటుగా జట్టులో వారిని రీప్లేస్ చేయడానికి అంతటి బలమైన ప్లేయర్లు ఉన్నారా? లేరా? అన్నది కూడా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ బెంచ్ జట్టును చూస్తే.. చాలా బలంగా ఉంది. అందుకే నేను అంటున్నా.. రోహిత్, కోహ్లీ జట్టులో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదని” అని సందీప్ వివరించారు. వాళ్లిద్దరూ కూడా అద్భుతమైన ప్లేయర్స్ అని, అందులోనూ కోహ్లీ గురించి తాను ఎంత చెప్పినా తక్కువేనని కూడా పాటిల్ అన్నాడు.

