కలం, వనపర్తి: పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో పాలమూరు ప్రాజెక్టులను పట్టించుకోని కేటీఆర్ ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (MLA Megha Reddy) విమర్శించారు. సీఎల్పీ మీడియా సెంటర్లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 శాతం పూర్తయిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని అన్నారు. గత ప్రభుత్వం సుమారు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ దాదాపు 40 శాతం పనులే పూర్తయ్యాయని, భూసేకరణ, ఆర్అండ్ఆర్ తదితర పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ అంశాలపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే..
ఎన్నికల ముందు మోటార్లు ప్రారంభిస్తున్నామంటూ హడావుడి చేశారని, కార్యక్రమం ముగిసిన తర్వాత అవి నిలిచిపోయాయని ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూసేకరణ, ఆర్అండ్ఆర్ ప్రక్రియలను వేగవంతం చేసి ప్రాజెక్టు పనులకు నిధులు కేటాయిస్తోందన్నారు. పెబ్బేరుకు వచ్చిన కేటీఆర్ మానవపాడు తహసీల్దార్ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటన, పెబ్బేరు సంత స్థలాల ఆక్రమణలు, కృష్ణా నది ఇసుక తరలింపు వంటి అంశాలపై కూడా మాట్లాడాలని మేఘారెడ్డి డిమాండ్ చేశారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం కాకుండా వాస్తవాలపై మాట్లాడాలని అన్నారు.

