రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్ ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత నిబంధనలు (Road Safety Awareness) తప్పక పాటించాలని, తన ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అన్నారు. “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వనపర్తి మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా బుధవారం స్థానిక కల్యాణ సాయి ఫంక్షన్ హాల్లో “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి (Sunitha Reddy) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు దేశంలో జరిగిన కొన్ని ఘోర రోడ్డు ప్రమాదాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. అదేవిధంగా పోలీస్, సాంస్కృతిక శాఖ కళాకారులు రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాల సేవనం ద్వారా జరిగే అనర్థాలను కళా ప్రదర్శన ద్వారా చూపించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాహనం నడిపే ప్రతి డ్రైవర్ నేను చాలా బాగా నడిపిస్తాను అనే ధీమాతోనే ఉంటారని, కానీ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు నిర్లక్ష్యానికి మూల్యం ఎంతటిదో తెలుస్తుందన్నారు. దేశంలో ప్రతి 4 నిమిషాలకు రోడ్డు ప్రమాదం ద్వారా ఒకరి ప్రాణం పోతుందని తెలియజేశారు. అందుకే వనపర్తి జిల్లాలో ప్రమాదాల నివారణకు వాహనదారులకు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతీ  ఒక్కరు తప్పకుండా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ పెట్టుకోవడం, నాలుగు చక్రాల వాహనం నడిపేవారు సీటు బెల్టు వేసుకోవడం, స్పీడ్ లిమిట్ పాటించడం, మద్యం సేవించి వాహనాలు నడిపించకపోవడం, ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపించకపోవడం వంటి కనీస నిబంధనలు (Road Safety Awareness) పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిని ఉపేక్షించేది లేదని, జరిమానాలు భారీగా వేయడం జరుగుతుందని తెలియజేశారు.

జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డుపై తనిఖీలు నిర్వహించినప్పుడు పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అపోహ పడతారని, కానీ రోడ్డు భద్రత అనేది వాహనదారుల ప్రాణాలు కాపాడటానికే తప్ప ఇబ్బందులకు గురి చేయడానికి కాదని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత అనేది ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించాలని, ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ ప్రాణంతో పాటు ఇతరుల ప్రాణాలు కాపాడే విధంగా వాహనం నడిపించాలని సూచించారు. అనంతరం రోడ్డు భద్రతపై కళా ప్రదర్శన నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు, పోలీస్ కళాకారులకు హెల్మెంట్ ప్రధానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనా, మున్సిపల్ కమిషనర్ మునావర్ అలీ, డీఎస్పీ గిరిధర్, బసంతి ఫౌండేషన్ నిర్వాహకులు అజయ్ నాయుడు, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు, సీఐలు, ఆటో డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: అవినీతి నిరూపిస్తే రాజీనామా: అడ్లూరి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>