కలం, వెబ్ డెస్క్: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లల్లో భారీగా అవినీతి జరిగిందని.. రైతుల వడ్లకు కోత విధించారని ఇటీవల బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. తాను పండించిన ధాన్యంలోనూ క్వింటాల్‌కు 10 కిలోలు తగ్గించారని జీవన్ రెడ్డి తెలిపారు. కాగా ఈ ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు.
అక్రమాలు జరగలేదు
ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. మాజీ మంత్రులు జీవన్ రెడ్డి పదేపదే అసత్య ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రైతులకు ప్రభుత్వం పారదర్శకంగా సేవలు అందిస్తుంటే రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీ జరిగిందన్న వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
జీవన్‌రెడ్డికి ఖాతాలో డబ్బులు జమ
జీవన్ రెడ్డి తన సొంత ధాన్యానికి సంబంధించి కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. జీవన్ రెడ్డికి సంబంధించిన ట్రక్ షీట్‌తోపాటు కొనుగోలు వివరాలను అడ్లూరి మీడియాకు విడుదల చేశారు. జీవన్‌రెడ్డికి చెందిన 190 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, అందుకు సంబంధించిన చెల్లింపులు కూడా ఆయన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అన్ని రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. అయినప్పటికీ కొందరు నేతలు వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
పింక్ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డి
పింక్ కండువా కప్పుకున్న జీవన్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని, నిరాధార ఆరోపణలతో రైతుల్లో గందరగోళం సృష్టించవద్దని మంత్రి హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు ఆధారాలు చూపించాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని, రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో వరి వేసుకొని.. మిగిలిన రైతులు వరి వేసుకోవద్దని పిలుపునిచ్చారని.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.

