Mobile Popup Ad
Mobile Popup Ad

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి: ఎంపీ కడియం కావ్య

కలం, వరంగల్ బ్యూరో: దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వరంగల్ ఎంపీ  డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ చైర్మన్‌కు ఆమె బుధవారం లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కల్పించేలా రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కాస్ట్స్ ఆర్డర్, 1950లోని పేరా – 3ను తొలగించాలని డిమాండ్ చేశారు.

వివక్ష ఎదుర్కొంటున్న దళిత క్రైస్తవులు

క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ షెడ్యూల్డ్ కులాల మూలాలు కలిగిన దళిత క్రైస్తవులు ఇప్పటికీ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. మత మార్పిడి జరిగినంత మాత్రాన కుల ఆధారిత వివక్ష, సామాజిక వెనుకబాటుతనం తొలగిపోలేదని వివరించారు. కేవలం మతాన్ని ఆధారంగా చేసుకుని ఎస్సీ హోదాను నిరాకరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16, 46లో పొందుపరిచిన సమానత్వం, సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమ లక్ష్యాలకు అనుగుణంగా దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని కావ్య కోరారు. గతంలో సిక్కులు, బౌద్ధులకు షెడ్యూల్డ్ కులాల గుర్తింపును విస్తరించిన నేపథ్యంలో, అదే సూత్రాన్ని దళిత క్రైస్తవుల విషయంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

కమిషన్ల సిఫార్సులను ప్రస్తావించిన ఎంపీ

అలాగే జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ (2007) తోపాటు పలు కమిషన్లు చేసిన సిఫార్సులను ప్రస్తావిస్తూ, రాజ్యాంగంలోని పేరా–3ను తొలగించాలని కోరారు. దళిత క్రైస్తవులకు షెడ్యూల్డ్ కులాల హోదా కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో, ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది షెడ్యూల్డ్ కులాల మూలాలు కలిగిన క్రైస్తవులు ఉన్నారని తెలిపారు. వారికి ఎస్సీ హోదా కల్పించడం ద్వారా విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, రాజ్యాంగబద్ధమైన రక్షణలు అందుబాటులోకి వస్తాయని ఎంపీ పేర్కొన్నారు. సమానత్వం, లౌకికవాదం, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ విలువలను బలోపేతం చేసే దిశగా ఈ అంశంపై సానుకూల సిఫార్సు చేయాలని జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్‌ను ఎంపీ కడియం కావ్య కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>