ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా.. పోలీసుల తీరుపై విమర్శలు!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రహదారుల విస్తరణతో ప్రమాదాలు దరిచేరవని, తొందరగా గమ్యం చేరుకోవాలనే వాహనదారుల అంచనాలు తారుమారవుతున్నాయి. వాహనాలపై వెళ్లిన వ్యక్తులు ఏ సమయంలో, ఎలాంటి పరిస్థితులలో వస్తారోనని కుటుంబ సభ్యులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు దాపురించాయి. పాలమూరు చుట్టుపక్కల బైపాస్‌ల పేరా అందంగా రహదారుల విస్తరణ పనులు జరిగినా, పోలీసుల పర్యవేక్షణ, వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లులేక అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మహబూబ్‌ నగర్‌ (Mahabubnagar) లో గత పక్షం రోజుల్లో రోడ్లపై దారుణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాలమూరులో కూడా హైదరాబాద్ తరహా బైక్ రేసింగ్‌ల సంస్కృతికి అలవాటు పడిన కొంతమంది యువకులు అర్ధరాత్రుళ్లు బైకులపై రేసింగ్‌లు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. పిస్తా హౌస్ నుండి క్రిస్టియన్ పల్లి వరకు నూతనంగా నిర్మించిన బైపాస్ రోడ్డుపై ఇటీవల అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలలో మృత్యువాత పడ్డవారు కొందరైతే.. వికలాంగులుగా మారిన వారు మరికొందరు. అయినా ప్రమాదాలు నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఇటీవల జిల్లా ఎస్పీ జానకి సైతం ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసులకు ఆదేశాలు ఇచ్చినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా బైపాస్ రోడ్డుపైనే రెండు బార్ షాపులు వెలిశాయి. ఇదే కాకుండా కొంతమంది యువకులు గంజాయి సేవించి రోడ్లపైనే పిచ్చి చేష్టలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తాగిన మైకంలో ఎవరు ఎలా డ్రైవింగ్ చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పాలమూరు పోలీసులు వాహనాల వైపు కెమెరాలు గురి పెట్టడం, క్లిక్ అనిపించడం, ఫోటో తీయడం, డబ్బులు వసూలు చేయడం కాకుండా ప్రమాదాల నివారణకు ప్రజలను చైతన్యపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పట్టణంలో రూరల్, వన్ టౌన్, టూ టౌన్, ట్రాఫిక్, మహిళా, సీసీఎస్, ఇంటలిజెన్స్ పోలీస్ స్టేషన్లతో పాటు డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాలు ఉన్నా అవి ప్రజల కోసం పనిచేయడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్‌కు సీఐ, ఎస్ఐ సరిపడా సిబ్బంది ఉన్నా వసూళ్లకు తప్పా డ్యూటీలు చేయడం లేదనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. పట్టణంలో అస్తవ్యస్త ట్రాఫిక్, వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్, అనుమతి లేని సైలెన్సర్లతో శబ్దం చేస్తున్నా, ఇళ్లలో దొంగలు పడినా, ప్రమాదాలు జరిగినా ఇవేమి పోలీసులకు పట్టని వ్యవహారం అని ప్రజలు వారి తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా పోలీసులు చేస్తున్న డ్యూటీ మాత్రం భూముల సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దోపిడీకి అండగా ఉంటూ డబ్బులు ఇస్తే చాలు పెద్ద వాహనాలకు పట్టణంలో తిరిగేందుకు ఫుల్ పర్మిషన్ ఇస్తారు. అలాగే ఇసుక లారీలు బాహాటంగా కళ్లేదుటే మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న పట్టించుకునే దిక్కే లేదంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.

పాలమూరు పట్టణం మీదుగా క్రిస్టియన్ పళ్లి నుంచి చిన్నదర్పల్లి వరకు దాదాపు పది కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు విస్తరించి ఉంది. ఈ రోడ్డుపై బారికేడ్లు కానీ డివైడర్లు కానీ నిర్మించలేదు అయినా వేగంగా వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. నూతన రోడ్లు నిర్మించేది వేగంగా గమ్య స్థానానికి చేరడమే అయినా, మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణాలు అవుతున్నాయి. ఈ వైపుగా స్థానిక పోలీసులు, జాతీయ రహదారుల సంస్థ, ఆర్ అండ్ బి అధికారులు దృష్టిసారించి చర్యలు చేపట్టకపోతే మరిన్ని ప్రమాదాలకు కారకులవుతారనేది సత్యమని ప్రజలు అంటున్నారు. ప్రమాదాల నివారణకు సూచికల బోర్డులతో పాటు , మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాలను అదుపు చేయడం, బైక్ రేసింగ్‌లకు ఆస్కారం ఇవ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>