కలం, వెబ్‌డెస్క్: కృత్రిమ మేధ AI (Artificial Intelligence) సాంకేతికత అద్భుతమైన మార్పులను తీసుకువస్తున్నప్పటికీ, దాని వెనుక కొన్ని ప్రమాదకరమైన భద్రతా సవాళ్లు దాగి ఉన్నాయి. ప్రస్తుతం AI వ్యవస్థల భద్రతకు సర్వర్ల రక్షణే అతిపెద్ద సమస్యగా మారింది. సరైన నిఘా లేని షాడో AI (Shadow AI), డేటా సెంటర్లపై పెరిగిపోతున్న దాడులు.. సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. AI సర్వర్లపై జరుగుతున్న దాడులు కేవలం ఇన్ఫర్మేషన్ దొంగతనానికే పరిమితం కాకుండా, AI ఇచ్చే ఫలితాలనే తారుమారు చేసే స్థాయికి చేరుకున్నాయి.
గుర్తుతెలియని ముప్పు
సంస్థల్లో ఐటీ విభాగం అనుమతి లేకుండా ఉపయోగించే AI టెక్నాలజీని ‘షాడో AI’ అంటారు. వీటికి సరైన సెక్యూరిటీ అప్‌డేట్స్ లేకపోవడం వల్ల హ్యాకర్లకు ఇవి సులభమైన దారులుగా మారుతున్నాయి. మరోవైపు, వేల కోట్ల సమాచారాన్ని భద్రపరిచే డేటా సెంటర్లు సైబర్ నేరగాళ్లకు ప్రధాన లక్ష్యంగా మారాయి. ఒక్క సర్వర్ హ్యాక్ అయినా, అది నెట్‌వర్క్ మొత్తాన్ని కుప్పకూల్చే ప్రమాదం ఉంది. AI కొన్నిసార్లు నిజం కాని సమాచారాన్ని నిజంలాగా భ్రమింపజేస్తుంది. ఇది వైద్యం లేదా ఆర్థిక రంగం వంటి కీలక విభాగాల్లో ప్రాణాపాయానికి లేదా భారీ నష్టాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా AI లోపాలను వాడుకుని, దానికి ఇచ్చే ఇన్‌పుట్ డేటాలో స్వల్ప మార్పులు చేసి దాన్ని తప్పుదారి పట్టించడం వంటి నష్టాలు జరుగుతున్నాయి. ఉదాహరణకు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో ఇలాంటి దాడులు జరిగితే తీవ్ర ప్రమాదాలు సంభవించవచ్చు. ఇంకా డేటా పాయిజనింగ్.. AI నేర్చుకునే శిక్షణ డేటాలోనే తప్పుడు సమాచారం నింపి, అది తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేయడం వంటి నష్టాలు జరిగే ప్రమాదం ఉంది.
ముప్పు నుంచి బయట పడేందుకు..
ఈ దాడుల నుండి తప్పించుకోవడానికి సంస్థలు కఠినమైన నిబంధనలను పాటిస్తున్నాయి. వాటిలో మొదటిది యాక్సెస్ కంట్రోల్.. ముఖ్యం కాని వ్యక్తులు డేటాను చూడకుండా నియంత్రించడం. ప్రాంప్ట్ ఇంజెక్షన్ సెక్యూరిటీ.. AI కి ఇచ్చే ఆదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, తప్పుడు కమాండ్లను అడ్డుకోవడం. అంతేకాకుండా భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల ద్వారా వచ్చే దాడులను సైతం తట్టుకునేలా క్రిప్టోగ్రఫీ అల్గారిథమ్స్ ఉపయోగించడం వంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. గతంలో కొన్ని బ్యాంకులు AI ని ఉపయోగించి ఆర్థిక నేరాలను అడ్డుకోవాలని ప్రయత్నించి, సరైన సర్వర్ భద్రత లేక భారీ నష్టాలను చవిచూశాయి. అప్పటి నుండి నేర్చుకున్న పాఠాలతో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఆధారిత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను రూపొందిస్తున్నారు. ఇవి దాడులను ముందే గుర్తించి హెచ్చరిస్తాయి. ఏదేమైనా, AI ఎంత వేగంగా ఎదుగుతోందో, దానికి సమానంగా భద్రతా వ్యూహాలను కూడా పటిష్టం చేసుకోవడం తక్షణ అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

