బీసీల జోలికొస్తే ఊరుకోం: తీన్మార్ మల్లన్న

కలం, మిర్యాలగూడ: బీసీల జోలికొస్తే ఊరుకోబోమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) హెచ్చరించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి బీసీలు, బీసీ ఉద్యోగులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. బీసీల కోసం పనిచేస్తున్న తమ్మడబోయిన అర్జున్‌తో పాటు పలువురు బీసీ ఉద్యోగులపై కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీ రాజ్యాధికార యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుని 38వ రోజుకు చేరుకుంది. శనివారం మిర్యాలగూడకు చేరుకున్న యాత్రకు పార్టీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక సెంటర్‌లో పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వైద్యం వెంకటేశ్వరులు అధ్యక్షతన జరిగిన సభలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. బీసీ ఉద్యోగులు ధైర్యంగా ఉండాలని.. బీసీల జోలికొస్తే బయట అడుగు కూడా పెట్టలేరని హెచరించారు. రాబోయే రోజుల్లో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కచ్చితంగా బీసీల వశం చేసి, బీసీ బిడ్డనే ఎమ్మెల్యేగా గెలిపిస్తామన్నారు.

ఓట్లన్నీ బీసీలవే..

మిర్యాలగూడ నియోజకవర్గంలో 2.31 లక్షల ఓట్లలో ఏకంగా 2,06,306 ఓట్లు బీసీలవే ఉన్నాయని తీన్మార్ మల్లన్న గణాంకాలతో విశ్లేషించారు. కేవలం 16,887 రెడ్డిల ఓట్లు, పదుల సంఖ్యలో ఉన్న కమ్మ సామాజికవర్గం ఓట్లతో దొంగతనంగా వాళ్లే ఎమ్మెల్యేలు అవుతున్నారని దుయ్యబట్టారు. రెండు లక్షలకు పైగా ఓట్లు ఉన్న బీసీలు ఐక్యతతో తమ రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

70-80 ఏళ్లుగా రెడ్డి, వెలమ నాయకులను నమ్ముకుంటే బీసీలకు మిగిలింది కేవలం అప్పులేనని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, టీడీపీ వంటి వివిధ రాజకీయ పార్టీల్లో బలమైన బీసీ నాయకులు ఉన్నారని, అయితే ఆయా పార్టీల పెత్తందార్లు వారిని ఎదగకుండా తొక్కిపెట్టారని పేర్లతో సహా ఎండగట్టారు. ఇకనైనా ఆయా పార్టీలు, నాయకులకు విడాకులు ఇచ్చి, బీసీల సొంత పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీతో కలిసి రావాలని కోరారు. 2028లో బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని కోరారు.

ఈడబ్ల్యూఎస్ పేరుతో..

కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం. 65 వలన బీసీ బిడ్డలకు 79 మార్కులు వచ్చినా ఉద్యోగాలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5.3 శాతం ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ పేరుతో 10 శాతం రిజర్వేషన్లు కల్పించి బీసీ, ఎస్సీల పొట్ట కొట్టారని వివరించారు. బీసీ బడ్జెట్ నుంచి స్కాలర్‌షిప్‌ల నిధులు రూ.1,600 కోట్లు, హాస్టల్ సొమ్ము రూ.120 కోట్లు, గీత కార్మికుల నిధులు రూ.50 కోట్లు దారి మళ్లించారని ఆధారాలతో అసెంబ్లీ లెక్కలను బయటపెట్టారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీసీల ఆత్మగౌరవానికి, పెత్తందార్ల అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధమని, పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకుని బీసీలకే మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>