కలం, కరీంనగర్ బ్యూరో: శాంతంగా సాగుతున్న ప్రయాణంలో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలు రేగాయి. రోడ్డుపై వెళ్తున్న బస్సును ఓ గ్రానైట్ కంటైనర్ వేగంగా ఢీకొనడంతో క్షణాల్లో హాహాకారాలు మిన్నంటాయి. కరీంనగర్ (Karimnagar) జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట (ఆసిఫ్ నగర్) సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Asifnagar Bus Accident) చోటుచేసుకుంది. గ్రానైట్ బండరాయిని తరలించేందుకు వెళ్తున్న ఓ భారీ కంటైనర్ ఎదురుగా వస్తున్న కరీంనగర్ -1 డిపోకి చెందిన TS02 UC 6363 నంబర్ గల ఆర్టీసీ బస్సును ప్రమాదకర రీతిలో ఢీకొట్టింది. ఈ ప్రమాద దాటికి ఆర్టీసీ బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు..
బస్సు డ్రైవర్‌తో పాటు ముందు సీట్లలో కూర్చున్న ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో బాధితుల అరుపులు, రోదనలతో తీవ్ర కలకలం రేగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రంగంలోకి కలెక్టర్..
ప్రమాద తీవ్రతను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ఆర్టీసీ డీఎంతో అత్యవసరంగా ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. “గాయపడిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందాలని, వైద్యాధికారుల బృందం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ నిరంతర సహాయం అందించాలని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది.” అని కలెక్టర్ పేర్కొన్నారు.
పొన్నం ప్రభాకర్ ఆదేశాలు..
ఈ ప్రమాదంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీ, పోలీస్ కమిషనర్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన, నాణ్యమైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

