ఉమ్మడి నల్లగొండలో ‘ఈవీ’ విప్లవం.. ఎలక్ట్రిక్ వాహనాలు రయ్‌రయ్

కలం, నల్లగొండ బ్యూరో: ఇరాన్‌పై యుద్ధ మేఘాల నేపథ్యంలో చమురు ధరలు పెరగడం.. ఇంధన కొరత ఏర్పడుతుందన్న ఆందోళన వాహనదారులను కలవరపెడుతోంది. పెట్రోల్ బంకు ముందు ‘నో స్టాక్‘ బోర్డు కనిపిస్తే చాలు.. సామాన్యుడి గుండె గుభేల్ మంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి ఎలక్ట్రిక్ వాహనం (Electric Vehicles) ఉత్తమ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా వ్యాప్తంగా వాహనదారులు ఇప్పుడు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టడం కంటే.. ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకుని సాఫీగా ప్రయాణించేందుకే మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్‌లో విద్యుత్తు వాహనాల ధరలు రూ. 30 వేల నుంచి అందుబాటులో ఉండటం సామాన్యులకు కలిసివచ్చే అంశం. ఫోర్-వీలర్లతో పోలిస్తే ద్విచక్ర వాహనాల నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణానికి సులభంగా ఉండటంతో జనం ఎక్కువగా టూవీలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న షోరూమ్‌లు, ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య చూస్తుంటే.. భవిష్యత్తులో రహదారులపై విద్యుత్తు వాహనాలదే పైచేయి కానుందని స్పష్టమవుతోంది.

టూవీలర్లదే హవా.. మిడిల్ క్లాస్ సరికొత్త లెక్క..

ఉమ్మడి జిల్లాలో ఫోర్-వీలర్ల కంటే ద్విచక్ర వాహనాలకే గిరాకీ ఎక్కువగా ఉంది. కేవలం రూ. 30 వేల నుంచి రూ. 2.50 లక్షల లోపు బడ్జెట్‌లోనే మంచి మోడళ్లు అందుబాటులో ఉండటం మధ్యతరగతి వర్గాలకు వరంగా మారింది. రోజువారీ ఆఫీసు పనులు, కూరగాయల మార్కెట్‌కు వెళ్లే వారికి పెట్రోల్ బిల్లుల భారం నుంచి శాశ్వత విముక్తి లభిస్తోంది. ఇంట్లోనే మొబైల్ ఫోన్‌లా ఛార్జింగ్ పెట్టుకునే సౌలభ్యం ఉండటంతో బంకుల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పింది. మరోవైపు ప్రభుత్వ రవాణా రంగంలోనూ ఈవీల (Electric Vehicles) హవా పెరుగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 166 విద్యుత్తు బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు నల్లగొండలో 34 ఉండగా, సూర్యాపేటలో 72 బస్సులు ఉన్నాయి. అదే సమయంలో డీలక్స్ బస్సులు నల్లగొండలో 40, సూర్యాపేటలో 7 బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు మిర్యాలగూడ డిపోలో 13 అందుబాటులో ఉన్నాయి. అయితే సాధారణ బస్సులు ఎక్కి ప్రయాణించడం కంటే ఈవీ బస్సులు ఎక్కేందుకు జనం మొగ్గు చూపుతున్నారు. ఎలాంటి సౌండ్ లేకపోవడం.. సీటింగ్ కంఫర్టబుల్‌తో‌పాటు వేగంగా గమ్యాన్ని చేరుకుంటుండడంతో ఈవీ బస్సులపై చూస్తున్నారు.

ఉపాధికి కొత్త దారి..

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఉండటంతో ఉమ్మడి జిల్లాలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ఒక లాభదాయకమైన వ్యాపారంగా అవతరించింది. సూర్యాపేట జిల్లా 18 ఛార్జింగ్ స్టేషన్లతో అగ్రస్థానంలో ఉండగా, నల్లగొండ (15), యాదాద్రి (15) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా హైవేల వెంట ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పుడు కేవలం భోజనానికే కాదు, వాహనాల ఛార్జింగ్‌కు కూడా అడ్డాగా మారుతున్నాయి. హైవేల వెంట ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడం ఇప్పుడు మంచి వ్యాపారంగా మారింది. ఛార్జింగ్ స్టేషన్ల పెరుగుదల వల్ల స్థానికులకు ఆపరేటర్లుగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుత టెక్నాలజీతో కేవలం 40 నుంచి 60 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తి చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ ధరలతో పోలిస్తే ఈవీల వినియోగం వల్ల ఇంధన భారం, భయం రెండూ పోయాయని చెప్పాలి. ఈవీ వాహనాలపై ప్రభుత్వ రాయితీలు, పన్ను మినహాయింపులు వినియోగదారులకు అదనపు బలంగా మారాయని చెప్పాలి.

Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>