కలం, నిర్మల్: తరిచి చూడాలే కానీ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అందమైన జలపాతాలున్నాయి. వర్షాలు పడే వేళ.. పూర్తి జలకళ సంతరించుకొని రారామ్మని ఆహ్వానిస్తున్నాయి. పర్యాటకులను మరిచిపోలేని అనుభూతులను ఇస్తాయి. ముఖ్యంగా నిర్మల్ (Nirmal) జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో ఉన్న అందమైన జలపాతం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
ఈ జలపాతం చూసేందుకు ఆదివారం సందర్శకులు భారీగా తరలివచ్చారు. సెలవు దినం కావడంతో ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జలపాతం అందాలను ఆస్వాదించారు. గుట్టపై నుంచి జాలువారుతున్న జలధారల్లో స్నానాలు చేస్తూ సందర్శకులు సందడి చేశారు. ప్రకృతి సోయగాల నడుమ కుటుంబ సభ్యులు, యువత ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఆహ్లాదకర క్షణాలను ఆస్వాదించారు. వర్షాలతో జలపాతం పూర్తి కళతో ప్రవహిస్తుండటంతో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.

