కలం, వెబ్ డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పలు బిల్లులు ప్రవేశ పెట్టబోతుంది. తొలి రోజు రెండు కీలకమైన బిల్లులను సభ ముందుకు తీసుకు రాబోతుంది. ఈ మేరకు లోక్ సభ నోటిఫికేషన్ జారీ చేసింది.
వందేమాతరం గీతానికి రక్షణ..
వందేమాతరం గీతానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు గాను 1971 నాటి చట్టానికి సవరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రవేశ పెట్టబోతున్నారు. ఇప్పటివరకు జన గణ మన గీతానికి మాత్రమే రక్షణ ఉంది. అయితే, ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వందేమాతరం గీతానికి కూడా ఈ తరహా రక్షణ చర్యలు అవసరమని కేంద్రం భావించింది.
దీని ప్రకారం, వందేమాతరం గీతాన్ని ఉద్దేశపూర్వకంగా అవమానించడం, పాడకుండా అడ్డుకోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇందుకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
సుప్రీంకోర్టులో జడ్జిల సంఖ్య పెంపు..
సుప్రీంకోర్టులో ప్రస్తుతం 33 మంది జడ్జిలు ఉన్నారు. ఈ సంఖ్యను 37కి పెంచే బిల్లును రేపు లోక్ సభలో ప్రవేశ పెట్టబోతున్నారు. దీని కోసం సుప్రీంకోర్టులో జడ్జిల నియామకాల చట్టం–1956ను సవరించబోతున్నారు. వాస్తవానికి మే నెలలో దీనిపై ఆర్డినెన్స్ తీసుకురాగా.. ఇప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్నారు.
సుప్రీంకోర్టుపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా.. జడ్జిల సంఖ్యను పెంచాలని కేంద్రం భావిస్తోంది. సుప్రీంకోర్టులో జడ్జిల నియామకాలను కొలీజియం ద్వారానే జరుగుతుంటాయి. సంఖ్య పెంపు మాత్రం పార్లమెంట్ చేసే చట్టం ద్వారానే సాధ్యమవుతుంది.

