కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లాను ప్రభుత్వం తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని సిపిఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి చుక్క రాములు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, రైతులు వేసిన పంటలు ఎండి పోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు.
సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో రైతంగంలో తీవ్ర ఆందోళన నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు విద్యుత్ కోతలు కూడా పెరిగిపోతున్నాయని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా పత్తి, కంది, మినుము వంటి పంటలు సాగు చేసే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
తేమ లేకపోవడం వల్ల విత్తనాలు మొలకెత్తే దశలోనే ఎండిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. సింగూర్ ప్రాజెక్టు రిపేర్ పనులలో జాప్యం జరుగుతుండడంతో ఈ సారి కూడా రైతులకు పంటలకు, తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కొన్ని పట్టణాలు, గ్రామాల్లో తాగడానికి నీళ్లు సరఫరా లేక ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కమిటీ సభ్యులు ప పాల్గొన్నారు.

