కలం, నిజామాబాద్ బ్యూరో: పెద్దలంతా చిన్న పిల్లల్లా మారిపోయారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఏకమయ్యారు. ఆనాటి పదో తరగతి రోజులను గుర్తు చేసుకొని ఎమోషన్ అయ్యారు. ఇప్పుడు వారి వయస్సు 60.. నిజామాబాద్ (Nizamabad) జిల్లా రెంజల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం జరిగింది. 1979- 80 బ్యాచ్‌కి చెందినవారు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. నాలుగున్నర దశాబ్దాల తరువాత ఒకచోటకు చేరి నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు కృషి చేసిన నాటి విద్యార్థులు స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, సుదర్శన్ రాజ్, గంగాధర్ గౌడ్ మీరా సాబ్, బాలాచారి తదితరులను అందరూ అభినందించారు.
ఈ సమావేశానికి ప్రస్తుత పాఠశాల ప్రధాన అధ్యాపకులు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి ఆంజనేయులు అధ్యక్షత వహించారు. విజయానందరావు, లక్ష్మీకాంత చారి, మధుకృష్ణ, రెడ్డి ప్రకాష్, దారం గంగాధర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యాయుడు విజయానందరావు మాట్లాడారు. 46 సంవత్సరాలకు పూర్వం చదువు చెప్పిన ఉపాధ్యాయులను సత్కరించడం తమలో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం అటు ఉపాధ్యాయులను ఇటు విద్యార్థులను ఉత్సాహపరిచింది.

