కలం, ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో (RIMS Hospital) జరిగిన ఘటనలో పసికందులు మృతి చెందడంపై నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని కిన్నెర, ముత్నూర్, కేస్లాగూడ, ఏమాయికుంట తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన రిమ్స్ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రిమ్స్ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందుల ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. పసిప్రాణాలకు పరిహారం పేరుతో రూ. 5 లక్షలు కేటాయించడం సరికాదని, పేద కుటుంబాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. బాధిత కుటుంబాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ( Ritesh Rathod) డిమాండ్ చేశారు.
రిమ్స్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారం పెంచే విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

