కలం, వెబ్‌డెస్క్: భారత్, పాక్ యుద్ధంతోపాటు అనేక జగడాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడినని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) పదే పదే ఇంటా బయటా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కుదిర్చారంటూ రికీ గిల్ (Ricky Gill) అనే వ్యక్తిని ట్రంప్ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. రంజిత్ రికీ సింగ్ గిల్(37) భారతీయ మూలాలున్న వ్యక్తి. ప్రస్తుతం ట్రంప్‌కు ప్రత్యేక సహాయకుడిగా, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ(ఎన్ఎస్సీ)లో సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం ఆపారంటూ గిల్‌కు ‘డిస్టింగ్విష్డ్ యాక్షన్ అవార్డ్’ను ఎన్ఎస్సీ ప్రకటించింది. ఈ అవార్డును గిల్‌కు స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో అందజేశారు.
అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన భారతీయ సిక్కు కుటుంబంలో గిల్ (Ricky Gill) జన్మించారు. తల్లిదండ్రులు జస్బీర్, పరమ్ గిల్. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గిల్ న్యాయవిద్య చదివారు. అత్యంత ప్రతిభావంతుడైన గిల్ పదిహేడేళ్లకే అమెరికా ప్రభుత్వంలో కొలువు సంపాదించారు. ప్రస్తుతం ఎన్ఎస్సీలో భారత్, ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సహా దక్షిణ, మధ్య ఆసియాకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. కాగా, పహల్గాం ఉగ్రదాడి అనంతరం, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాక్ మధ్య స్వల్పకాలిక యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు దేశాల సైన్యం జరిపిన చర్చల్లో కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిందని భారత్ పదే పదే చెప్తోంది. యుద్ధం ఆగడంలో మరొకరి జోక్యం లేదంటోంది. అయినా ట్రంప్ మాత్రం తన వల్లే భారత్, పాక్ యుద్ధం ఆగిందంటున్నారు. ఇప్పుడు తన వద్ద పనిచేసే వ్యక్తికి అవార్డు ఇచ్చి, తద్వారా తాను చెప్పేది నిజమని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం.. ట్రంప్ కు దేశ అత్యున్నత పురస్కారం!
Follow Us On: Pinterest


