కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం సినిమా రంగును పులుముకున్నాయి. ఒకప్పుడు వెండితెరకు, రాజకీయ వేదికలకు మధ్య హద్దులు ఉండేవి. కానీ నేడు ఆ హద్దులు చెరిగిపోయి, సినిమా డైలాగులు, క్యారెక్టర్లు పొలిటికల్ వార్‌లో ప్రధాన అస్త్రాలుగా మారుతున్నాయి. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నేతలు.. ప్రత్యర్థులను దెబ్బకొట్టడానికి, వారిపై ప్రజల్లో నెగిటివ్ ముద్ర వేయడానికి హిట్ సినిమాలలోని విలన్ పాత్రలను వాడుకుంటున్నారు. ప్రెస్ మీట్లు, బహిరంగ సభల్లో సినిమాటిక్ కౌంటర్లు, పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Revanth Reddy vs KTR) ఒకరిపై మరొకరు సినిమాటిక్ స్థాయిలో విమర్శలు చేస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు చర్చనీయాంశమవుతున్నాయి.
ఈ సరికొత్త పొలిటికల్ డ్రామాకు రైతు భరోసా నిధుల పంపిణీ వేదికగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్‌ను బ్లాక్‌బస్టర్ సినిమా ‘అరుంధతి’లోని భయంకరమైన విలన్ పాత్ర ‘పశుపతి’తో పోల్చారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను పశుపతిలాగే ఓడించి, ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారని ఆయన కామెంట్ చేశాడు. రాష్ట్ర ప్రజలకు కీడు చేయాలనుకున్న ఆ ‘పశుపతి’ని అలాగే ఫామ్‌హౌస్‌లోనే బంధించి ఉంచాలని పిలుపునిచ్చారు. మళ్లీ బయటకు రాకుండా చూడాలని ప్రజలకు పిలుపునిస్తూ రేవంత్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్ని లేపాయి.
ముఖ్యమంత్రి విసిరిన ‘పశుపతి’ బాణానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే స్థాయిలో సినిమాటిక్ కౌంటర్ ఇచ్చారు. కేవలం ఒక ఎకరానికి రైతుభరోసా నిధులు వేయడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy vs KTR) ఇంత హడావుడి చేస్తూ బహిరంగ సభలు పెట్టడం ప్రచార ఆర్భాటమేనని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఎలాంటి హడావుడి లేకుండా ఒక బటన్ నొక్కి వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే రేవంత్ శైలిలోనే తిప్పికొడుతూ.. ‘‘బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడికి చివరికి ఎలాంటి గతి పట్టిందో, రైతులకు వెన్నుపోటు పొడుస్తున్న రేవంత్ రెడ్డికి కూడా భవిష్యత్తులో అదే గతి పడుతుంది’’ అంటూ భళ్లాలదేవుడి పాత్రను తెరపైకి తెచ్చారు. ఇలా తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ‘బాహుబలి వర్సెస్ అరుంధతి’గా మారి సరికొత్త హాట్ టాపిక్‌గా నిలిచాయి.

