epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత ఇదేనా?

కలం డెస్క్ : ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (Telangana Local Body Elections) వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ (Congress) పార్టీని నిరాశకు గురిచేశాయి. అన్ని పార్టీలకంటే ఎక్కువ మందిని గెలిపించుకోగలిగినా ఆశించిన స్థాయిలో లేదన్నది కాంగ్రెస్ భావన. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), అటు పీసీసీ చీఫ్‌ (PCC Chief) పూర్తిస్థాయిలో సంతృప్తిగా లేరని (Disappointed) పార్టీ వర్గాల సమాచారం. పలువురు ఎమ్మెల్యేలు (MLAs) వారి స్వగ్రామాల్లో పోటీచేసిన అభ్యర్థుల్ని సైతం గెలిపించుకోలేకపోవడాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకున్నది. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను దీటుగా ఎదుర్కోవడంలోనూ ఎమ్మెల్యేలు, మంత్రులు తగినంత చొరవ చూపలేదన్నది పార్టీ అభిప్రాయం. ఈ నెల 22న ఇన్‌ఫార్మల్‌గా జరిగే క్యాబినెట్ సమావేశంలో (Cabinet Meeting) సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించి మంత్రుల పనితీరుపై సూటిగా కామెంట్లు చేసే అవకాశమున్నది.

మంత్రులు, ఎమ్మెల్యేల ఉదాసీన ధోరణి :

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు రావడం పార్టీకి మింగుడుపడలేదు. ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని సీరియస్‌గా ప్రచారం చేయలేదన్న అభిప్రాయానికి వచ్చింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు వివరించి సమన్వయం చేయడంలో ఫెయిల్ అయ్యారనే అసంతృప్తినీ పార్టీ వ్యక్తం చేసింది. ఫలితాలను విశ్లేషించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా డాటాను సిద్ధం చేశారు. వీటికి అనుగుణంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రులతో లోతుగా డిస్కస్ చేసి నిర్లక్ష్యం ఎక్కడ జరిగిందో వేలెత్తి చూపే అవకాశమున్నది. రెబల్ అభ్యర్థుల్ని నిలువరించేలా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోకపోవడాన్నీ ప్రస్తావించనున్నట్లు తెలిసింది. టికెట్ల కేటాయింపులో జరిగిన లోపాల కారణంగానే సొంత అభ్యర్థులు ఓడిపోయి రెబల్ అభ్యర్థులు గెలిచారనే మాటలూ పార్టీలో వినిపిస్తున్నాయి.

ఇలాగైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలెలా? :

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రుల వివరణ తీసుకునే అవకాశమున్నది. రిపీట్ కాకుండా చూసుకోవాలని సున్నితంగా హెచ్చరించే అవకాశాన్ని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఇకపైన జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలాంటి బాధ్యత తీసుకుంటారో, ఫలితాలు వన్‌సైడ్‌గా వచ్చేలా ఎలాంటి చొరవ చూపుతారో వారి నుంచే అభిప్రాయాలను తీసుకునే అవకాశమున్నది. సర్పంచ్, వార్డుల సభ్యుల ఎన్నికల ఫలితాలు పాలనకు రిఫరెండం అనుకోవాలా?.. లేక ఎమ్మెల్యేలు చొరవ తీసుకోలేదనే నిర్ణయానికి రావాలా?.. లేక జిల్లా మంత్రులు అంటీ ముట్టనట్లుగా వ్యవహరించారనుకోవాలా?.. కేడర్‌తో, ప్రజలతో సంబంధాలు చెడిపోయాయని అనుకోవాలా?.. ఇలాంటి అనేక ప్రశ్నలు పార్టీలో వినిపిస్తున్నాయి. కచ్చితంగా ఇలాంటి ఫలితాలు పార్టీ ఆశించలేదని, ప్రతీ ఒక్కరూ సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని సీఎం నొక్కిచెప్పే అవకాశమున్నది.

గత ఎన్నికలతో పోలిస్తే వరస్ట్ :

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2019లో జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి 62% స్థానాలు దక్కాయని, ఇప్పుడు కాంగ్రెస్‌కు కేవలం 59% మాత్రమే వచ్చాయన్నది పార్టీ భావన. అప్పట్లో విపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు 21% వస్తే ఇప్పుడు విపక్షంగా ఉన్న బీఆర్ఎస్‌కు 28% సీట్లు వచ్చాయనే విశ్లేషణకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినచోట కూడా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో ఫలితాలు ఎందుకు తక్కువగా వస్తాయని ఆరా తీయనున్నది. జడ్చర్లలో మొత్తం 187 చోట్ల ఎన్నికలు జరిగితే అందులో కాంగ్రెస్‌కు 104 వచ్చినా బీఆర్ఎస్ 76 చోట్ల గెలిచింది. వనపర్తిలో 140 స్థానాలుంటే కాంగ్రెస్‌కు 79, బీఆర్ఎస్‌కు 56 వచ్చాయి. నర్సంపేటలోని 172 స్థానాల్లో కాంగ్రెస్, 108, బీఆర్ఎస్ 63 చొప్పున గెలిచాయి. నాగర్‌కర్నూల్‌లోని 131 స్థానాల్లో కాంగ్రెస్ 78, బీఆర్ఎస్ 49 చోట్ల గెలిచాయి. వన్‌సైడ్‌గా రావాల్సిన రిజల్టు ఎందుకు బెడిసికొట్టిందనేది పార్టీకి మింగుడుపడడంలేదు.

పరిస్థితిని చక్కదిద్దకుంటే నష్టమే :

దుబ్బాక, గజ్వేల్, బాల్కొండ, హుజూరాబాద్, కోరుట్ల, సంగారెడ్డి, నర్సాపూర్, జహీరాబాద్, మహేశ్వరం, ఆలంపూర్, జనగాం లాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కాంగ్రెస్ గణనీయంగా సర్పంచ్ స్థానాలు గెల్చుకున్నది. ఆ పార్టీకంటే కాంగ్రెస్‌కే ఎక్కువ స్థానాలు దక్కాయి. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎక్కువ సీట్లు దక్కడం పీసీసీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఈ పరిస్థతిని చక్కిదిద్దకపోతే, ప్రతిపక్ష పార్టీని కట్టడి చేయకపోతే, కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సహా మూడేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఊహించని ఫలితాలను చవిచూడాల్సి వస్తుందనే హెచ్చరికను జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు సీఎం వివరించి అలర్ట్ చేసే అవకాశమున్నది. పీసీసీ చీఫ్ సహా పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) త్వరలో ఎమ్మెల్యేలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించే అవకాశాన్ని కూడా పార్టీ వర్గాలు ఉదహరించాయి.

Read Also: బాగా ఆడినా సెలక్టర్లు పట్టించుకోలేదు: ఇషాన్ కిషన్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>