కాళేశ్వరంతో ప్రయోజనం లేదు: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుకు (Kaleshwaram Project) తెలంగాణకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతమని ప్రచారం చేసుకున్నారని.. కానీ, 2023 అక్టోబర్ నెలలో ప్రాజెక్ట్ కుప్పకూలిపోయిందన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ప్రకృతే బయటపెట్టిందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే లోపాలు బయటపడినా.. పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టు వైఫల్యంలో కేసీఆర్ (KCR), 130 మంది ఇంజినీర్ల బాధ్యత ఉందని పీసీ ఘోష్ కమిషన్ తేల్చిందన్నారు. వీరిపై తగు చర్యలు తీసుకోవాలని తాము సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తే.. ఇంత వరకు కేంద్రం స్పందించకుండా మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. కేసీఆర్, హరీశ్ రావును జైల్లో పెడుతామని బీజేపీ చెప్పిందని.. తాము రెండు సార్లు కేంద్రానికి లేఖ రాసినా స్పందించలేదన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆర్థిక ప్రయోజనం లేదని భావించి రీడిజైన్ చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ అంతా లోపాల మయంగా ఉందని ఫైర్ అయ్యారు. తమ్మిడిహట్టి వద్ద ఈ ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. కానీ పేరు మార్చి, డిజైన్ మార్చి అద్భుత ప్రాజెక్టు అంటూ బాకాలు ఊదారని పేర్కొన్నారు.

హరీశ్ రావు ఢిల్లీ పర్యటన అందుకే..

నెల రోజుల ముందే కాళేశ్వరం రావాలని నిర్ణయించుకున్నామని.. సరిగ్గా ఇదే రోజు కావాలనే బీఆర్ఎస్ అతి తెలివితో సభ ఏర్పాటు చేసుకుందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. జీవన్ రెడ్డి (Jeevan Reddy) తమ పార్టీలో చేరితే.. తమ బలం రెట్టింపు అవుతుందని కలలు కంటుందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై త్వరలోనే తీర్పు రాబోతున్న నేపథ్యంలో.. ఎవరి కాళ్లు పట్టుకునేందుకు హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లారని ప్రశ్నించారు. రహస్యంగా అక్కడ బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ పెద్దలను కలుస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించకపోతే.. ఆందోళనకు దిగుతామని తాను ఇటీవలే హెచ్చరించానని.. అక్కడ కదలిక రావడంతో.. తెల్లవారుజామునే హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లారని వివరించారు. ఎట్టిపరిస్థితుల్లో.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలడానికి బాధ్యులైనవారిని శిక్షించి తీరుతామని స్పష్టం చేశారు. దోషులను వదిలి పెట్టేది లేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించామని.. మూడు నిర్మాణ సంస్థలతో సమీక్ష చేసినట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి.. రైతులకు సాగు నీరు అందిస్తామని మరోసారి స్పష్టం చేశారు.

Read Also: కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>