కలం, వెబ్ డెస్క్: కృష్ణా నదీ జలాల విషయంలో కేసీఆర్ (KCR) చేసిన సంతకం తెలంగాణ ప్రయోజనాలకు ‘మరణశాసనం’లా మారిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల మంజూరు నుంచి తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన జలాల కేటాయింపుల వరకు గత ప్రభుత్వం అనుసరించిన తీరుపై ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి, పొరుగు రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేలా గత పాలకులు నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు, నీటి వాటాలపై సీఎం కీలక వివరాలను సభ ముందు ఉంచారు.
పదేళ్లు నిర్లక్ష్యం..
ఉమ్మడి రాష్ట్రంలో 2005 నుంచి 2014 మధ్య కాలంలోనే తెలంగాణ ప్రాంతానికి మేలు చేసేలా ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి, డిండి, మక్తల్-నారాయణపేట-కొడంగల్, కోయిల్ సాగర్ వంటి కీలక ప్రాజెక్టులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిందని సీఎం గుర్తు చేశారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సింది పోయి, అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. పదేళ్ల కాలంలో వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
నీటి వాటాల ఒప్పందంపై ధ్వజం..
కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో కేసీఆర్, హరీష్ రావు వ్యవహరించిన తీరు తెలంగాణ ప్రజలకు మరణశాసనంగా మారిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణ వాటాగా 490 టీఎంసీలు అడగాల్సి ఉండగా, కేవలం 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేయడం చారిత్రక తప్పిదమని మండిపడ్డారు.
2015 జూన్ లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ, ఆ తర్వాత 2016 సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ మనకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్ తాత్కాలిక వాటాలకు ఒప్పుకున్నారని సీఎం వివరించారు. చివరకు 2020 అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ మీటింగ్‌లో ఈ కేటాయింపులనే శాశ్వతంగా కొనసాగించాలని అంగీకరించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు.
కాంగ్రెస్ కృషితోనే..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సాధనలో కాంగ్రెస్ నాయకుల కృషిని సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2009లో అప్పటి ఎంపీ విఠల్ రావు వైఎస్ రాజశేఖరరెడ్డికి లేఖ రాసి ఈ ప్రాజెక్టుకు పునాదులు వేశారని, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నాయకులతో పోరాడి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దీనిని సాధించుకున్నారని చెప్పారు. ఆ సమయంలో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ ఈ ప్రాజెక్టు గురించి కనీసం అడగలేదని, ఇప్పుడు ఏ నైతిక హక్కుతో మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
కృష్ణా నీటిని పదేళ్ల పాటు ఏపీకి తరలించుకుపోయేందుకు సహకరించి, ఇప్పుడు బయట బహిరంగ సభలు పెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ధైర్యం ఉంటే సభకు వచ్చి చర్చించాలని తాము ఆహ్వానించినా, వాస్తవాలు బయటపడతాయనే భయంతో కేసీఆర్ సభకు రాకుండా వెళ్లిపోయారని ముఖ్యమంత్రి విమర్శించారు.
Read Also: బీఆర్ఎస్ చారిత్రక తప్పిదం.. పైచేయి సాధించిన కాంగ్రెస్
Follow Us On : WhatsApp


