కేటీఆర్‌కు షాక్ … సిరిసిల్ల వేదికగా సీఎం రేవంత్ బిగ్ ఎక్స్‌పోజ్?

కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలాకా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన అంశాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. పదేండ్లలో బీఆర్ఎస్ నేతలు ఎక్కడెక్కడ ఎంత భూమిని ఆక్రమించుకున్నారో.. అడ్డదారుల్లో ఎంత సంపాదించుకున్నారో.. అసెంబ్లీ వేదికగా లెక్కలతో సహా చెప్పిన సీఎం.. ఇప్పుడు ఈ ఒక్క నియోజకవర్గం పరిధిలోనే దాదాపు 8,700 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూముల గోల్మాల్ జరిగిందనే అంశాన్ని ఎక్స్‌పోజ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.

ఏ గ్రామంలో ఎంత భూమి..? ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది..? ఎలా చేతులు మారింది? తెరవెనుక ఎవరున్నారు? ఊర్లు, పేర్లతో సహా మొత్తం చిట్టాను విప్పనున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సభను సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. నాలుగు రోజులుగా మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు ఇక్కడే మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సభతో కేటీఆర్‌కు కౌంట్డౌన్ స్టార్ట్ అయిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ గెలిచే ప్రసక్తే లేదని, గెలవనివ్వబోమని ముఖ్యమంత్రి ఇప్పటికే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైమ్ సీఎం హోదాలో సిరిసిల్లలో నిర్వహిస్తున్న సభ.. కేటీఆర్ రాజకీయ భవితవ్యంపై స్థానికంగా చర్చకు తెరలేపింది.

1,500 ఎకరాలు వాపస్‌..?

గత ప్రభుత్వం ‘ధరణి’ పేరుతో నిర్వహించిన భూ లావాదేవీలను లెక్కలతో సహా సీఎం వెల్లడించేలా రంగం సిద్ధమైంది. ఏదో జరగబోతున్నదనే అలజడితో వంద మందికి పైగా గులాబీ లీడర్లు, వారితో సన్నిహిత సంబంధాలు ఉన్న నియోజకవర్గానికి చెందినవారు దాదాపు 1,500 ఎకరాలకు పైగా భూమిని ఇప్పటికే ప్రభుత్వానికి వాపస్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా సీఎం వెల్లడించే అవకాశమున్నది. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వ్యవహారంపై ఇప్పటికే కమిటీని నియమించిన ప్రభుత్వం, నెల రోజుల వ్యవధిలో ఎంక్వయిరీ రిపోర్టును సమర్పించాలని ఆదేశించింది. ఈ రిపోర్టులో వెల్లడయ్యే వివరాలు ఎలా ఉన్నా.. పొలిటికల్గా మాత్రం కేసీఆర్‌కు సిరిసిల్ల సభ ద్వారా సీఎం గట్టి సవాలు విసిరే అవకాశమున్నది. ధరణి పేరుతో ఎవరి భూములు ఎవరికి బదిలీ అయ్యాయో చెప్పే లెక్కలు రాష్ట్రవ్యాప్తంగానే చర్చకు దారితీసే అవకాశమున్నది. దీనికి కొనసాగింపుగా సిద్దిపేటలో సైతం అక్టోబరు ఫస్ట్ వీక్‌లో నిర్వహించే సభ ద్వారా హరీశ్ రావు వ్యవహారాన్ని సైతం బయటపెట్టాలని సీఎం ప్లాన్ చేస్తున్నారు.

కేటీఆర్ పన్నెండు ప్రశ్నలకు జవాబు

ముఖ్యమంత్రి ప్రస్తావించిన భూముల లెక్కలను ఉదహరించిన కేటీఆర్ ఇటీవలే బహిరంగ లేఖ రాశారు. పన్నెండు అంశాలను అందులో ప్రస్తావించారు. వీటన్నింటికీ స్పష్టమైన సమాధానాలను లెక్కలతో సహా సీఎం సిరిసిల్ల బహిరంగ సభ వేదిక మీద నుంచి జవాబు ఇవ్వనున్నట్లు తెలిసింది. మరోసారి ఈ అంశాలను ప్రస్తావించే అవకాశం లేకుండా ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ఆవిష్కరించిన శిలాఫలకాలు, ప్రోగ్రెస్ రిపోర్టు, లేటెస్ట్ స్టేటస్.. వీటన్నింటినీ సీఎం ప్రస్తావించనున్నట్లు సమాచారం. పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఫూలే, నేతన్నల విగ్రహాల మీదుగా బహిరంగ సభ జరిగే రంగినేని ట్రస్ట్ వరకు దాదాపు గంట పాటు పాదయాత్ర చేస్తూ వివిధ సెక్షన్లకు చెందిన లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. వెయ్యి రోజుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు గురించీ ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. కేసీఆర్‌కు కంచుకోట అని చెప్పుకునే సిరిసిల్ల నుంచే ఆయన రాజకీయ పతనం మొదలుకావాలన్నది సీఎం ఆలోచన. అందుకే ఈ సభను ఆయన ఛాలెంజ్‌గా తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>