కలం డెస్క్ : కలలు కనండి.. ఉన్నత లక్ష్యాన్ని పెట్టుకోండి… అలాంటి గొప్ప టార్గెట్లు పెట్టుకున్నవారే విజయాలను సాధిస్తారు.. సాధించేవరకు విశ్రమించకండి… లక్ష్యం లేకుంటే విజయం రాదు… ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, కష్టపడడం.. ఇవీ విజయానికి మెట్లు.. – మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం.
సరిగ్గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాంటి లక్ష్యాన్నే నిర్దేశించుకున్నారు. రాబోయే 22 ఏండ్లలో (2047 సంవత్సరం నాటికి) రాష్ట్ర ఎకానమీ (జీఎస్‌డీపీ – GSDP)ని మూడు ట్రిలియన్ డాలర్లకు (3 Trillion Dollars Economy) పెంచాలనుకుంటున్నారు. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను కూడా ఈ నెల 9న రిలీజ్ చేస్తున్నారు. ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి ఉన్న మార్గాలను అందులో ప్రస్తావించనున్నారు. ప్రస్తుతం పావు ట్రిలియన్ డాలర్లు కూడా లేని తెలంగాణ ఎకానమీని పన్నెండు రెట్లకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. మరో ఎనిమిదేండ్లు సీఎంగానే కొనసాగుతానని పలుమార్లు ప్రస్తావించారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకున్నందుకు సీఎం రేవంత్‌ను అభినందించాల్సిందే. కానీ దాన్ని అందుకోవడమే అతి పెద్ద సవాల్. ఆ డైరెక్షన్‌లో విజన్ డాక్యుమెంట్‌లో ఆయన ఎలాంటి మార్గాన్ని చూపుతారు… అవి ఆ లక్ష్యాన్ని సాకారం చేస్తాయా… ఇవే ఇప్పుడు కీలకం.
3 ట్రిలియన్ డాలర్లు అంటే ఎంత?
ఇప్పుడున్న విదేశీ మారకం ప్రకారం ఒక డాలర్‌కు 90 రూపాయలు. ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లు. మూడు ట్రిలియన్ అంటే మూడు లక్షల కోట్లు. ఒక ట్రిలియన్ డాలర్లంటే దాదాపు 90 లక్షల కోట్ల రూపాయలు. ఆ ప్రకారం మూడు ట్రిలియన్ డాలర్లు అంటే 270 లక్షల కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రస్తుత ఎకానమీ (Telangana Economy) రూ. 18 లక్షల కోట్లు. అంటే రానున్న 22 ఏండ్లలో దాదాపు 18 రెట్లు పెరగాలి. ప్రతీ ఏటా డబుల్ డిజిట్‌లో వృద్ధిరేటు అవసరమవుతుంది. ఇంతటి పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే అన్ని రంగాల్లోనూ అంతటి స్థాయిలో డెవలప్‌మెంట్ అవసరం. ఏకకాలంలో అటు రాష్ట్ర అభివృద్ధి, ఇటు సంక్షేమం, పెట్టుబడుల వెల్లువ, పన్నుల వసూళ్ళు, రాష్ట్ర ఆదాయంతో పాటు వ్యక్తుల ఆదాయం పెరగడం.. ఇలాంటివన్నీ కార్యరూపం దాల్చాలి. ‘క్యూర్’ (CURE), ‘ప్యూర్’ (PURE), ‘రేర్’ (RARE) అనే మూడు రకాలుగా అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు.
ట్రిలియన్ డాలర్లకు ఎన్ని సున్నాలుంటాయి :
నిత్యం మనం లక్షాధికారి, కోటీశ్వరుడు అని మాట్లాడుకుంటూ ఉంటాం. అతిపెద్ద సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ లాంటి సంస్థలు ప్రకటించినప్పుడు మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్ల డాలర్ల లెక్కల్లో వింటూ ఉంటాం. కానీ సామాన్యులకు ఆ అంకెలకు ఎన్ని సున్నాలు ఉంటాయో ఊహించుకోవడం కాస్త కష్టమే. 500 రూపాయల కరెన్సీ నోట్ల రూపంలో ఊహించుకుంటే ఎన్ని కోట్ల కట్టలవుతాయో అంచనాకు అందదు. కనీసం ఎన్ని బస్తాలు అవసరమవుతాయి.. ఎన్ని లారీలు కావాల్సి ఉంటుంది.. ఇలా కూడా మనం ఊహించలేం. లక్షకు ఐదు సున్నాలైతే 270 లక్షల కోట్లకు ఆ అంకె తర్వాత 12 సున్నాలు పెట్టాలి. అంటే సామాన్యుల బుర్రకు తట్టడం కష్టమే. అంకెల్లో చెప్పుకోవాలనుకుంటే 27,00,00,00,00,00,000 (అంటే 2.7 కోట్ల కోట్లు). ఇది 270 లక్షల కోట్లకు సమానం. మిలియన్ల లెక్కల్లో చూస్తే ఇది 270,000,000,000,000.
దాదాపు మొత్తం దేశ జీడీపీకి సమానం :
ప్రస్తుతం మొత్తం దేశ జీడీపీ రూ. 330 లక్షల కోట్లు. ప్రతి ఏటా సగటున 6-8% చొప్పున వృద్ధి రేటు నమోదు కావచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. తెలంగాణ జీఎస్‌డీపీ 22 ఏండ్ల తర్వాత ఇప్పుడున్న మొత్తం దేశ జీడీపీకి సమానం అవుతుందనేది సీఎం రేవంత్‌రెడ్డి అంచనా. దేశ జీడీపీ సింగిల్ డిజిట్‌లో పెరుగుతూ ఉంటే రాష్ట్ర జీఎస్‌డీపీ మాత్రం సీఎం రేవంత్ లక్ష్యం ప్రకారం డబుల్ డిజిట్‌లో సాకారం కావాలి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ బిజినెస్ కుదేలైంది.. లిక్కర్ తప్ప ఆదాయం లేదు.. పన్నులు పెంచితే ఆదాయం పెరిగే అవకాశాలున్నా ఓటు బ్యాంక్ దెబ్బతింటుంది.. ఇలాంటి ఆందోళనల నడుమ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (3 Trillion Dollars Economy) డ్రీమ్ ఆచరణరూపం దాల్చడం ఒక బిగ్ ఛాలెంజ్. గ్రామీణ-పట్టణ ప్రజల మధ్య ఆర్థిక అంతరాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని పూడ్చడంతో పాటు అన్ని సెక్షన్ల ప్రజల సంపదను పెంచడం, వారి రోజువారీ అవసరాలు తీరడం, చెలామణి పెరగడం.. ఇవన్నీ సవాళ్ళు.
సుదీర్ఘ కసరత్తుతోనే ఇది సాధ్యం :
ఇంత భారీ స్థాయిలో రాష్ట్ర సంపద పెరగాలంటే బలమైన పాలసీలతో పాటు రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులను మార్చడం కూడా ప్రధానమైన అంశం. ఈ స్థాయిలో ఆర్థిక వనరులు పెరగాలంటే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న సంపద గణనీయంగా పెరగాలి. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీసెస్.. ఇవన్నీ పెరగాలి. ఉత్పత్తి, వినియోగం, ఆదాయం.. ఇవన్నీ పెరగాల్సి ఉంటుంది. మన అవసరాల కోసం ఉత్పత్తి చేసుకోవడం మాత్రమే కాక ఇతర రాష్ట్రాలకు, దేశాలకు కూడా ఎగుమతి చేసేంత స్థాయిలో ఫోకస్ పెట్టాలి. ఎకానమీ పెంచుకోడానికి క్యూర్, ప్యూర్, రేర్ అనే పాలసీని విజన్ డాక్యుమెంటులో ప్రస్తావిస్తున్నా అది గాడిన పడాలంటే సీఎం రేవంత్ తరహాలోనే ఆయన టీమ్, ఆఫీసర్లు, ప్రజలు నడవాల్సి ఉంటుంది. కమిట్‌మెంట్, కష్టపడే తత్వం, లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన.. ఇవన్నీ ఉన్నప్పుడే సాధ్యం. కానీ అవినీతి, కమిషన్లు, రాజకీయాలు.. ఇలాంటి ప్రతికూలతల నడుమ సీఎం రేవంత్ లక్ష్యం నెరవేరుతుందా? దీనికి కాలమే సమాధానం చెప్తుంది.
Read Also: ఇండిగో మీద నోరెత్తని బీజేపీ.. ఎందుకు..?
Follow Us On: Pinterest


