కలం, వెబ్ డెస్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. ఈ జిల్లా ప్రజలు అమాయకులు కాదని పేర్కొన్నారు. గతంలో ఓ సారి దయతలిచి కేసీఆర్‌ను గెలిపించారని.. ఇక నుంచి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా కనిపించనియ్యకుండా చేస్తానన్నారు. ‘పాలమూరు జిల్లా ప్రజలు మట్టి పని చేస్తారు. గుంతలు తోడుతారు. అవసరమైతే అదే గుంతలో పాతిపెడతారు’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చర్చలతోనే సమస్యలు పరిష్కారం
పక్క రాష్ట్రం ఏపీతో కచ్చితంగా చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకుంటామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. బరాబర్ చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన కాళ్ల మధ్యలో కట్టెలు పెడుతున్నారని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వెర్రి మాటలు, తిర్రి మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 2019లో కూడా తెలంగాణ రాష్ట్రానికే కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ (KCR) రావాలని సవాల్ విసిరారు. పాలమూరు జిల్లాను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.
లక్షల కోట్లు దోచుకుతిన్నారు
బీఆర్ఎస్ పార్టీ గడిచిన పదేండ్లలో రాష్ట్రాన్ని దోచుకుతిన్నదని ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద పెట్టి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయిందని ఆరోపించారు. గోదావరి జలాల మీద కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిపోయిందని.. పాలమూరు జిల్లాలో కట్టిన ప్రాజెక్టులు మొత్తం అసంపూర్తిగానే మిగిలిపోయాయని ఆరోపించారు.
సోనియమ్మ దయతోనే తెలంగాణ
రాజకీయంగా నష్టపోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని.. మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేసి అప్పుల పాలు చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు మేకవన్నె పులి అయిన కేసీఆర్‌ను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని పేర్కొన్నారు. కానీ ఆయన మాత్రం రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు. జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ మొదలుపెట్టిన ప్రాజెక్టులను సైతం కేసీఆర్ పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు.
అధికారం మీకు.. అవస్థలు ప్రజలకా?
కేసీఆర్ ఆయన కుమారుడు, ఆయన మనవుడు మాత్రమే అధికారంలోకి రావాలని కేసీఆర్ కలలు కన్నారని పేర్కొన్నారు. కానీ రాష్ట్రంలోని దళితులు మాత్రం వాళ్ల చెప్పులు మోయాలా? అని ప్రశ్నించారు. మనం గొర్రెలు, బర్రెలు కాసుకోవాలని కేసీఆర్ భావించారని ఫైర్ అయ్యారు.
జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగా..
తాను 20 ఏండ్ల క్రితం మిడ్జిల్ జెడ్పీటీసీగా గెలుపొంది.. అనంతరం ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా నేడు ముఖ్యమంత్రిగా అయ్యాయనని చెప్పారు. మారుమూల నల్లమల ప్రాంతం నుంచి తాను వచ్చానని.. రైతు బిడ్డగా తనకు వారి కష్టాలు తెలుసని పేర్కొన్నారు. కచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం చేస్తానన్నారు. పాలమూరులో ఉన్న ‘మర్రి చెట్టు ఎంతమందికి నీడ ఇస్తుందో నేను అంతమందికి నీడ ఇస్తాను’ అంటూ వ్యాఖ్యానించారు. ఉద్దండాపూర్ బాధితులను పోలీస్ స్టేషన్లలో వేసి కొట్టించిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు. ఎక్కడి నుంచో వచ్చిన కేసీఆర్ పాలమూరు జిల్లాకు న్యాయం చేయగలరా? అంటూ ప్రశ్నించారు.
Read Also: స్పా సెంటర్ల పై పోలీసుల మెరుపు దాడులు
Follow Us On: Sharechat

