Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రమాదాల్లో అసలైన ‘అగ్ని’పరీక్ష అదే..!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా గతేడాది కంటే ఈసారి అగ్నిప్రమాదాలు (Fire Accidents) ఎక్కువయ్యాయి. భవనాలకు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉన్నదో లేదో తనిఖీ చేసే ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం, ప్రజల బాధ్యతారాహిత్యం అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడు వేలకు పైగా ఫైర్ కాల్స్ వచ్చినట్లు ఫైర్ డిపార్టుమెంట్ వర్గాల సమాచారం. ఇందులో ఎక్కువగా హైదరాబాద్ సిటీలోనే 700కు పైగా ఉన్నట్లు తెలిసింది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకోవడంలో చిక్కులతో పాటు డిపార్టుమెంట్లో సిబ్బంది కొరత కూడా తీవ్రంగానే ఉన్నది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా సకాలంలో చేరుకోలేకపోడానికి ఒక కారణం. వేసవి కాలంలో ఎక్కువగా జరిగే ఫైర్ యాక్సిడెంట్లతో అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం, ఎయిర్ కండిషనర్ల వినియోగం పెరగడం, కాలం చెల్లిన ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ ఈ ప్రమాదాలకు ప్రధాన కారణాలవుతున్నాయని డిపార్టుమెంట్ అంటున్నది.

వేధిస్తున్న సిబ్బంది కొరత

రాష్ట్రంలో జనాభాకు, కాలనీల్లోని జనసాంద్రతకు తగినట్లుగా ఉండాల్సిన ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రం మొత్తం మీద 137 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. డిపార్టుమెంట్లో వివిధ డిజిగ్నేషన్లలో శాంక్షన్డ్ స్ట్రెంత్ 2,596 అయినప్పటికీ (ఈ ఏడాది జనవరి నాటికి) 1,732 మందే పనిచేస్తున్నారు. ఇంకా 864 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఫైర్ ఫైటర్ పోస్టులే ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల ప్రకారం.. ఫైర్ ఫైటర్లు 1,612 మంది ఉండాలి. కానీ, ఇందులో 902 మంది పనిచేస్తున్నారు. ఇంకా 710 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి.

ఫైర్ ఫైటర్ (టెక్నికల్) పోస్టులు 475 మంజూరైతే 101 ఖాళీగా ఉన్నాయి. డిపార్టుమెంట్లో మ్యాన్ పవర్ ఆశించినంతగా లేకపోవడంతో విధుల్లో ఉన్న సిబ్బందిపైనే అదనపు షిఫ్టుల ఒత్తిడి పడుతున్నది. విపత్తుల నిర్వహణను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో గజ్వేల్, చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియా, జీనోమ్ వ్యాలీ లాంటి స్టేషన్లలో కొన్ని కొత్త పోస్టులను మంజూరు చేసినా ఫైర్‌మెన్, డ్రైవర్ల కొరత పూర్తిగా తీరలేదు. ప్రస్తుతం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని ఖాళీల భర్తీకి ప్రక్రియ మొదలైంది.

కో ఆర్డినేషన్ కరువు..

హైదరాబాద్ నగరంలోని భవనాలకు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉండాలంటూ మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ డిపార్టుమెంటు తరచూ చెప్తూ ఉంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ ఇంజిన్ వెళ్లడానికి వీలుగా తగిన సౌకర్యాలు ఉండాలని కూడా చెప్తుంటాయి. అధికారికంగానే కొన్ని నిబంధనలను రూపొందించాయి. కానీ, ఇవి ఉన్నాయో లేవో తనిఖీ చేసే ప్రభుత్వ సిబ్బందిలో అంతులేని నిర్లక్ష్యం. అగ్ని ప్రమాదం (Fire Accidents) జరిగినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత గాలికి వదిలేయడం రొటీన్ ప్రాక్టీసుగా మారింది. ప్రభుత్వం రూపొందించే నిబంధనలు పటిష్టంగా ఉన్నా అమలులో, పర్యవేక్షణలో మాత్రం లోపాలు కొనసాగుతూనే ఉన్నాయి. భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే విభాగం, ఫైర్ డిపార్టుమెంట్ మధ్య సమన్వయ లోపం కూడా కొనసాగుతున్నది. నిబంధనలు పాటించకున్నా, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పెట్టుకోకున్నా లంచాలతో సర్దుబాటు చేసుకోవచ్చనే ప్రజల్లోని బాధ్యతారాహిత్య ధోరణి కూడా పెరిగిపోయింది.

ఇటీవల జరిగిన ఫైర్ యాక్సిడెంట్లలో కొన్ని:

• జనవరి చివరి వారం: హైదరాబాద్ నాంపల్లిలోని ఫర్నిచర్ షాపు, నివాస సముదాయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

• ఫిబ్రవరి 20: హైదరాబాద్ అమీర్ పేట్ మైత్రి వనంలోని ఓ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం.. భయంతో పరుగులు తీసిన స్థానికులు.

• మార్చి 16: హైదరాబాద్ ఫలక్‌నుమా పరిధిలోని ఫరూక్‌నగర్ బస్ డిపో పక్కన ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగి పక్కనే ఉన్న గ్యాస్ గోదాం వరకు వ్యాపించాయి.

• ఏప్రిల్, మే నెలల్లో: ఖమ్మం, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పలు ఓపెన్ ల్యాండ్స్, ఫామ్‌ ల్యాండ్స్, ఇండస్ట్రియల్ ఏరియాలలో భారీగా స్క్రాప్, కెమికల్ ప్రమాదాలు.

• జూన్ 4: అమీర్‌పేట్ మైత్రివనం సమీపంలోని కేఎస్‌ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఒక హోటల్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి వచ్చిన నిప్పురవ్వలు భారీ ప్రమాదానికి కారణమైంది.

అగ్గిరాజేస్తున్న సిగరెట్ ముక్క!

హైదరాబాద్ సిటీలో పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ జామ్‌ కారణంగా ఫైర్ ఇంజిన్లు సకాలంలో వెళ్లలేకపోతున్నాయి. పాతబస్తీ, సుల్తాన్ బజార్, అమీర్‌పేట్ లాంటి రద్దీ ప్రాంతాల్లోని ఇరుకు సందుల్లోకి పెద్ద ఫైర్ టెండర్లు వెళ్లడం కష్టంగా మారుతున్నది. రోడ్డు పక్కన పడేసే సిగరెట్ ముక్కలు, ఎండిపోయిన చెత్త, ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ పెరగడం, దుకాణాల్లో/భవనాల్లో షార్ట్ సర్క్యూట్‌కు గురికావడం కారణంగా ఎండకాలం అగ్ని ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దాదాపు నాలుగు వేల కేసులు కేవలం సిగరెట్ ముక్కల వల్లే జరిగాయి.

Read Also: బైకర్లకు ఎయిర్ బ్యాగ్.. కరీంనగర్ విద్యార్థికి జాతీయ గుర్తింపు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>