కలం, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి (Revanth reddy) సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ప్రకటించనున్నది. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో (Dearness Allowance) ఒకదాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ (సోమవారం) సాయంత్రం వెలువడనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తించేలా ఒక డీఏను విడుదల చేయనున్నారు.
తాజా నిర్ణయం ప్రకారం ఒక్క డీఏ విలువ 3.64 శాతంగా ఉండనుంది. ఈ డీఏ అమలుతో ఖజానాపై నెలకు సుమారు రూ.180 కోట్ల అదనపు భారం పడనుంది. వార్షికంగా లెక్కిస్తే దాదాపు రూ.2,160 కోట్ల వరకు వ్యయం పెరుగుతుందని ఆర్థికశాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే గత కొంతకాలంగా డీఏలు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. పెరిగిన నిత్యావసర ధరలు, జీవన వ్యయం నేపథ్యంలో డీఏ విడుదల చేయాలని పలుమార్లు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ తాజా నిర్ణయం ఉద్యోగులకు కొంత ఊరట కలిగించనుంది. ఆర్థిక భారం దృష్ట్యా ప్రభుత్వం దశలవారీగా డీఏలను (Dearness Allowance) విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో ఒకదాన్ని ముందుగా విడుదల చేయనున్నారు. ఈ డీఏ అమలుతో ఉద్యోగుల జీతాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించనుంది. అలాగే పెన్షనర్లకు కూడా పెన్షన్ మొత్తంలో పెరుగుదల కలుగుతుంది.
Read Also: మేడారం మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ
Follow Us On: X(Twitter)


